హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ధాన్యం ఎవరు కొనుగోలు చేయాలో, ఎవరితో యుద్ధం చేయాలో అనే అంశంపై కనీస పరిజ్ఞానం లేకుండా, దారి తప్పి వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే యాసంగిలో బాయిల్డ్ బియ్యం కొనేదిలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిక్కచ్చిగా ప్రకటించినప్పటికీ, బీజేపీని వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడమేమిటనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్‌సీఐ ఎదుట ఆందోళనలు నిర్వహించకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం వల్ల లాభం లేదనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్ నుంచి బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి, ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఈ నెల 23 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, స్పందించకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నేతలే విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో, రైతుల్లో చులకనయ్యామని, ఇప్పుడీ కార్యక్రమంలో నవ్వుల పాలు కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం వల్ల లాభమేమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
రేవంత్‌రెడ్డి తలపెట్టిన కల్లాలకు కాంగ్రెస్ కార్యక్రమంపై కూడా పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఠా మిడతల దండు మాదిరిగా వచ్చి, ధాన్యం కుప్పలను నాశనం చేసిందని, కాంగ్రెసోళ్లు కూడా మళ్లీ ధాన్యం కుప్పలను నాశనం చేస్తారా? అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడకుండా రైతులకు నష్టం చేసేలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు కల్లాల్లోకి వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. ఎంత ధాన్యం తీసుకొంటామనే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ఇప్పటికే 11 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఒకవైపు కొనుగోళ్లు కొనసాగుతుంటే.. అక్కడికే వెళ్లి, ధాన్యం కొనాలని డిమాండ్ చేయడమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.