హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రెవెన్యూ, జీఎస్టీ గ్రోత్ రేటు, వెహికల్ సేల్స్ రెవెన్యూ డౌన్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఒకటే డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తున్నదని, అది కూడా ఎక్సైజ్ శాఖ మాత్రమేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడుతూ రా ష్ట్రంలో మందు గమనం ఒక్కటే జోరు మీద ఉన్నదని, మిగతా అన్ని రంగాల్లో మందగమ నం నడుస్తున్నదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నినాదం రైజింగ్ అని, విధానం మా త్రం ఫాలింగ్ అని విమర్శించారు. రాష్ట్రంలో 2024-25లో రూ.9,420 కోట్లు, 2025-26లో రూ.9,235కోట్ల రెవెన్యూ లోటులో సర్కార్ ఉన్నదని వెల్లడించారు. నాడు స్వయం పాలనలో రాష్ట్రం అద్భుతంగా వృద్ధి సాధించి ఎస్వోటీఆర్ 84 శాతం సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని గుర్తుచేశారు.
2023లో లక్షా 11 వేల కోట్లు ఉన్న ఎస్వోటీఆర్, 2024కు వచ్చే సరికి లక్షా 9 వేల కోట్లకు చేరి రూ.2 వేల కోట్లు తగ్గిందని ఆందోళన వ్య క్తం చేశారు. ఓ వైపు ఆర్థిక పరిస్థితి బాగోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూనే పేపర్లలో దుబారాగా ప్రకటనలు ఇస్తున్నారని మం డిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఆర్బీఐ లెక్కలను కేంద్రం చెప్పిన తర్వాత కూడా కేసీఆర్ భారీగా అప్పులు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే మంత్రులు పొన్నం 70 వేలు, శ్రీధర్‌బాబు 80 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. ఇక పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం కాలం గడిచి పోయిందని రెండున్నరేండ్లలోనే రూ.4 లక్షల కోట్లు అప్పు చేసిందని కేటీఆర్ వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పులు తెచ్చి రైతుబంధు, యూరియా, రూ.4 వేలు పింఛను, మహిళలకు రూ.2,500, దివ్యాంగులకు రూ.6 వేలు, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు ఎకరానికి రూ.237 కోట్లు వచ్చిందని సర్కారే చెప్తున్నదని, మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్మెంట్ పొందిన వారికి బెనిఫిట్స్, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అమలు చేశారా? అని నిలదీశారు. ఈ ఏడాది మొత్తం రూ.55 వేల కోట్లు అప్పు చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే రూ.75 వేల కోట్లు అప్పు చేసిందని వెల్లడించారు. నెలకు రూ.2 వేల కోట్లు అప్పునకు మిత్తీ కడుతున్నట్టు కాగ్ లెక్కలు చెప్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఏకంగా రూ.6,500 కోట్లు కడుతున్నామని అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి మోటర్లకు మీటర్లు పెట్టము అంటూనే ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రలో 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, 30 లక్షల వ్యవసాయ మోటర్లు ఉన్నాయని వెల్లడించారు. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్ కింద ఆరు మోటర్లు ఉంటాయని వివరించారు. ఇవాళ ఆరు మోటర్లకు ఒక మీటర్ పెడుతామని రేవంత్‌రెడ్డి చెప్తున్నాడని, కొద్ది రోజుల తర్వాత మూడు మోటర్లకు ఒక మీటర్, తర్వాత ఒక్కో మోటర్‌కు మీటర్ పెడుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ ఏ డిస్కమ్ పెట్టకుండా 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వలేదా? నాడు వ్యవసాయ దిగుబడులు పెరిగి దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ కాలేదా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు రక్షణ కవచంలా ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని, రాష్ర్టాన్ని ఉజ్వల తెలంగాణగా భారతదేశానికి ఓ లైట్ హౌస్‌గా నిలబెట్టేదాకా బీఆర్ఎస్ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల లెక్కలపై, కాంగ్రెస్ వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలపై మంత్రులకే ఓ సయోధ్య లేదని కేటీఆర్ చురకలంటించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పు రూ.2.8 లక్షల కోట్లు అని ఆర్బీఐ చెప్పిన లెక్కను పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన నాడు రూ.73 వేల కోట్లతో తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. తమ ప్రభుత్వం అప్పు చేసి లక్ష కోట్లతో కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మించిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూ.30 వేల కోట్లతో 90 శాతం పూర్తి చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసినట్టు వెల్లడించారు. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని, దేశంలోనే అతిపెద్దదైన ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును దామరచర్లలో రూ.35 వేల కోట్లతో నిర్మించామని వెల్లడించారు. 1,000 గురుకులాలు పెట్టడంతో పాటు.. ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం కట్టారని చెప్పారు.