పారిస్: మట్టి కోర్టు టెన్నిస్ మహా సంగ్రామం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో మరో పెను సంచలనం. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అరీనా సబలెంకకు షాక్ తగిలింది. వరుస విజయాలతో టైటిల్ దిశగా దూసుకెళ్తున్న ఈ బెలారస్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోనే పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. రష్యా క్రీడాకారిణి డయానా ష్నైడర్.. గత సీజన్ రన్నరప్‌గా నిలిచిన అరీనాకు షాకిచ్చి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ష్నైడర్ అద్భుత ఆటతీరుతో 3-6, 7-5, 6-0తో సబలెంకను ఓడించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 2 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నాలుగు గ్రాండ్ స్లామ్స్ విన్నర్ అయిన అరీనా ఆరంభంలో వరుస పాయింట్లతో హడలెత్తించింది. తొలి సెట్‌ను సులువుగా గెలిచి, రెండో సెడ్లో డబుల్ బ్రేక్ సాధించి 4-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ప్రత్యర్థి పుంజుకున్నా 5-4 వద్ద మ్యాచ్ కోసం సర్వ్ చేస్తున్నప్పుడు విజయానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో నిలిచింది.
కానీ, తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న ష్నైడర్ ఒక్కసారిగా చెలరేగింది.పవర్ఫుల్ ఫోర్‌హ్యాండ్ విన్నర్లతో టాప్‌సీడ్‌కు చుక్కలు చూపెడుతూ మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లింది. తీవ్ర ఒత్తిడికి గురై లయ కోల్పోయిన సబలెంక వరుస తప్పిదాలతో బంతిని కోర్టులోకి పంపడానికి ఇబ్బంది పడింది. ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేసిన ఈ బెలారస్ స్టార్ తన చివరి 13 గేమ్స్‌లో ఏకంగా 12 గేమ్స్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోలాండ్‌కు చెందిన క్వాలిఫయర్ మయా క్వాలిన్స్కా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 7-6 (7/3), 6-3 తేడాతో 22వ సీడ్ అనా కాలిన్స్కయా (రష్యా)ను వరుస సెట్లలో ఓడించింది. మూడు క్వాలిఫయింగ్ రౌండ్లు దాటుకుని వచ్చిన 24 ఏండ్ల మయా.. ఇగా స్వియాటెక్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరిన పోలాండ్ రెండో మహిళగా చరిత్ర సృష్టించింది.
ఫెలిక్స్‌కు కొబోలి చెక్
పురుషుల సింగిల్స్‌లో మరో టాప్ సీడెడ్ ఆటగాడు ఇంటిదారి పట్టాడు. కెనడా స్టార్, నాలుగో సీడ్ ఫెలిక్స్ ఆగర్ అలిసిమె పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇటలీ ఆటగాడు, పదో సీడ్ ఫ్లావియో కొబోలి 4-6, 6-4, 6-4, 6-4తో ఆగర్‌ను ఓడించి సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. తొలి సెట్ కోల్పోయినా.. గొప్పగా పుంజుకున్న కొబోలి బలమైన షాట్లతో ఫెలిక్స్ పని పట్టాడు. మెరుగైన సర్వీస్‌లతో ఆకట్టుకుంటూ ఏడు ఏస్‌లు కొట్టిన ఆగర్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. తను ఒకే బ్రేక్ పాయింట్ రాబట్టగా.. కొబోలి నాలుగు బ్రేక్స్ సాధించి విజయం అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన 26వ సీడ్ యాకుబ్ మెన్షిక్ కూడా సెమీస్‌లో అడుగు పెట్టాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మెన్షిక్ 6-4, 6-3, 7-6 (7/3) తేడాతో 28వ సీడ్ బ్రెజిల్ ఆటగాడు జోవావో ఫోన్సెకాను ఓడించాడు. ప్రారంభం నుంచే తన పవర్ఫుల్ సర్వీస్‌లతో పట్టు సాధించిన మెన్సిక్ ప్రత్యర్థికి చెక్ పెట్టాడు.
శ్రీరామ్ బాలాజీ జోడీ ఓటమి
భారత టెన్నిస్ ఆటగాడు ఎన్. శ్రీరామ్ బాలాజీ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ప్రయాణం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో బాలాజీ- మార్సెలో డెమోలినర్ (బ్రెజిల్) జంట 3-6, 4-6 తేడాతో రెండో సీడ్ హ్యారీ హెలియోవారా-హెన్రీ ప్యాటెన్ జోడీ చేతిలో పరాజయం పాలైంది.