జకార్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రుత్వికా శివాని-రోహన్ కపూర్, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఆయుష్ 8-21, 22-20, 21-15 తేడాతో 15వ ర్యాంకర్ హాంగ్ యాంగ్ వెంగ్కు షాకిచ్చాడు. మరో మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ 17-21, 21-16, 19-21తో నాట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్‌లో రుత్వికా శివాని-రోహన్ జోడీ 21-14, 21-14తో చైనీస్ తైపీకి చెందిన యాంగ్ ఫొ- హులింగ్ ఫెంగ్‌పై సులువుగా గెలిచి ముందంజ వేసింది. మరోవైపు, పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టికి ఎదురుదెబ్బ తగిలింది. గత వారమే సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఈ ద్వయం తొలి రౌండ్ మ్యాచ్ ప్రారంభమైన 7 నిమిషాలకే గాయం కారణంగా వైదొలిగింది. కాంగ్ ఖై క్సింగ్ – ఆరోన్ తై (మలేషియా)తో మ్యాచ్‌లో 6-11తో వెనుకంజలో ఉన్న సమయంలో సాత్విక్ కుడి భుజం నొప్పితో ఇబ్బంది పడటంతో భారత జోడీ రిటైర్ అయింది.