కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఏప్రిల్ 01 : కేరళ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రధాని మోదీ, సీఎం పినరయ్ విజయన్ ఇద్దరూ ఒకటేనని మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ తీవ్రంగా ఖండించారు. స్థానిక మంచికంటి భవన్ లో రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒప్పందం చేసుకుని వామపక్షాలను కొన్ని స్థానాల్లో ఓడించారని, ఇది స్వయాన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడే బహిరంగంగా ప్రకటించాడని, ఆ ప్రకటన పట్ల రేవంత్ రెడ్డికి సోయి లేదా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులను కలుపుకుని పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ తమ అవకాశవాద అధికార రాజకీయాల కోసం లౌకిక విధానాలకు తిలోదకాలిచ్చి వామపక్షాలను విమర్శించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
దేశంలో మతోన్మాద రాజకీయాలను నికరంగా ఎదుర్కొనేది వామపక్షలేనని అన్నారు. కాంగ్రెస్ అవకాశ వాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే కేరళ ప్రజలు విద్యావంతులు కాబట్టే అనేక రకాల విపత్తుల నుండి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని రెండవసారి వామపక్ష ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టి చరిత్ర సృష్టించారని, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన అధికారం ఉపయోగించుకొని అనేక రకాల సవాళ్లు,నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ వివక్షత మధ్య కేరళలో విజయన్ నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిందన్నారు. ఈ అభివృద్ధిని చూసి కేరళ విద్యావంతులు మరల వామపక్ష ప్రభుత్వానికే పట్టం కడతారని అనేక సర్వేలు చెబుతున్నాయని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు కేరళ లాంటి చైతన్యవంతమైన గడ్డమీద అవకాశం లేదని పగటివేషగాడి రాజకీయాలు మానుకోవడం రేవంత్ రెడ్డికి మంచిదని ఆయన హితువు పలికారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేరళలో వెదజల్లి ఇక్కడ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఇప్పటి వరకు డబ్బు ప్రస్తావనే లేని కేరళ రాజకీయాలను కలుషితం చేశాడని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వైఖరులను అవలంబిస్తూ, సంఘ్ పరివార్‌తో రాజీ పడుతోందని విమర్శించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే రైటిస్ట్ సైద్ధాంతికత వైపు మొగ్గు చూపుతోందని, పౌరసత్వ సవరణ చట్టం సహా పలు అంశాలపై మైనారిటీల హక్కులను పరిరక్షించేందుకు వామపక్షాలే రాజీలేని పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల రైటిస్ట్ రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని వామపక్షాలే చూపిస్తున్నాయని, కేవలం పాపులారిటీ కోసమే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కు లేదు గానీ, కేరళ, అసోంలో కూడా ఇవే హామీలు ఇచ్చి గెలుస్తామనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, ఏం.జ్యోతి, ఎంబీ.నర్సారెడ్డి, బ్రహ్మచారి, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు పాల్గొన్నారు.