హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని, దానిపై ఆయన స్పందించేలా చూడాలని, ప్రధాని మోదీకి కూడా లేఖ పంపామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కూడా చర్చలు జరిపించాలని కోరారు. సోమవారం మీడియాతో రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వ్యవహారం, మావోయిస్టుల లొంగుబాట్లు, మహిళా రిజర్వేషన్లు, రీజినల్ రింగ్‌రోడ్ తదితర అంశాల మీద ఆయన మాట్లాడారు.
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై బాధిత బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమో దు చేసినట్టు తెలిపారు. ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదైందని, ప్రధాని మోదీ పర్యటన భద్ర తా ఏర్పాట్ల కారణంగా విచారణ ఆలస్యమైందని వివరించారు. భగీరథ్ కూడా కరీంనగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడని చెప్పారు. అన్నింటిమీద కలిపి సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించామని చెప్పారు. దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు.
2029లో జమిలి ఎన్నికలు జరిగే అవకా శం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 2011 జనాభా లెకల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అన్నారు. లోక్‌సభలోని 543 నియోజకవర్గాల పునర్విభజన దామాషా ప్రకారం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. 50 శాతం పెంపు అనే దానికి కూడా ఎలాంటి ఫార్ములా లేదని చెప్పుకొచ్చారు. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు.ఎస్ఐఆర్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తున్నదని ఆరోపించారు.
రీజినల్ రింగ్‌రోడ్ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం 50 శాతం నిధులు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో, సదరన్ పార్ట్, రీజినల్ రింగ్‌రోడ్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్, ఎయిర్పోర్ట్ క్లియరెన్స్‌లు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలకు అనుమతులు వచ్చాయని ఈ సందర్భంగా వెల్లడించారు. 2034 నాటికి తెలంగాణను లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తాను ప్రధాని మోదీని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారని సీఎం రేవంత్‌రెడ్డి పేరొన్నారు.
తెలంగాణలో 818 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, దేశంలో ఎకడా ఇలాంటి పరిస్థితి లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గణపతి వంటి నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మాట్లాడిన కొన్ని మాటలు దురదృష్టకరమని అన్నారు. ముస్లింలు, మావోయిస్టులు కూడా ఈ దేశ భాగస్వాములేనని చెప్పారు.