జోగులాంబ గద్వాల : పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇచ్చిన తీర్పుతోనైనా కాంగ్రెస్ , రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని బీఆర్ఎస్ ( BRS ) రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్( Vijaykumar ) సూచించారు. గద్వాల జిల్లా కేంద్రంలోనిక్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై మూడునెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ( Speaker ) ఆదేశించడం దేశ శాసన చరిత్రలో కీలకమైన పరిణామని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే తీర్పుని పేరప్కొన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గులాబీ జెండాతో, కేసీఆర్ ఫొటోతో గెలిచి కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయిన గద్వాల ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ గౌరవించి పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
పిటిషన్ ఇచ్చిన ఏడు నెలల తర్వాత ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడాన్ని తప్పు పట్టడం బీఆర్ఎస్ సాధించిన విజయమని వెల్లడించారు. స్పీకర్ ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా స్వంతంత్రంగా వ్యవహరించి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్లకు గురై తన బాధ్యతను మరవొద్దని అన్నారు. సుప్రీం కోర్టు స్పీకర్‌ను ఆదేశించజాలదని తప్పుడు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుల ను నివారించేందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం కోల్పోయేలా చట్టం తెస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల హామీలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యం లో మేనిఫెస్టో మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయాలన్నారు.
రాజ్యాంగం చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చర్యలను రాహుల్ గాంధీ అనుమతించడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆరోపించారు. ఢిల్లీలో ఓ నీతి గల్లీలో ఓ నీతి అంటే కుదరదని , నీతులు చెబుతూ, గోతులు తవ్వే చర్యలకు పాల్పడితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని విజయ్‌కుమార్ జోస్యం చెప్పారు.