హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అన్ని సీట్లు, ఓట్లు ఎలా వచ్చాయంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సహచర మంత్రులపై మండిపడినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీసినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం తన నివాసంలో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సత్తా చాటడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని స్థానాల్లో పోటీ ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలిసింది. బీఆర్ఎస్కు 28.75 శాతం ఓట్లు రావడంపై తీవ్రంగా మండిపడినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ప్రధానంగా బీఆర్ఎస్కు లభించిన సీట్లు, ఓట్లపైనే చర్చించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ అన్ని పురపాలికల్లో దాదాపు సగం వార్డులను గెలుచుకోవడం, 13 మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేయడం, పలు చోట్ల నిర్ణాయక శక్తిగా నిలువడంపై సీఎం ఆందోళన వ్యక్తంచేసినట్టు అంతర్గత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కేవలం నాలుగు లక్షలు మాత్రమే ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక అధికారంలో ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై సైతం సీఎం అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గానూ కేవలం 65 మున్సిపాలిటీల్లో మాత్రమే స్పష్టమైన మెజారిటీ సాధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని, ఆశించిన స్థాయిలో శ్రమించలేదని అన్నట్టు తెలిసింది. ఇక ఓట్ల శాతం తగ్గడంపై సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.80శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇదే కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో 40.10 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 39.40 శాతం ఓట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా.. ఓట్ల శాతం పెంచుకోలేకపోతే ప్రయోజనం ఏమిటని మండిపడినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతం తగ్గడం ఏమిటని నిలదీసినట్టు సమాచారం.
‘ఎవ్వరొస్తే వాళ్లను లాగేయండి.. ఎంతైనా పర్వాలేదు. అవసరమైతే ‘సెట్’ చేయండి.. ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు 100కు పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు తేల్చి చెప్పినట్టు తెలిసింది. సుమారు 36 స్థానాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఆ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో సీఎం చర్చించినట్టు తెలిసింది. ఎక్కడ కూడా అవకాశాన్ని వదులుకోవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులపై ఫోకస్ పెట్టాలని, వారిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది.
ఇందుకు సంబంధించి వాళ్లకు ఏం కావాలంటే అది సమకూర్చాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక స్వతంత్రుల మద్దతు కూడా సరిపోని చోట ఇతర పార్టీల అభ్యర్థులకు సైతం గాలం వేయాలని సూచించినట్టు తెలిసింది. ఏం చేసైనా 100కు పైగా మున్సిపాలిటీల్లో పాగా వేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ బాధ్యతను ఇన్చార్జి మంత్రులకు అప్పగించారు. తమ అభ్యర్థులను నేరుగా ఎన్నిక సమయానికి తీసుకెళ్లాలని, పండుగలని, గుడికి పోతామని అంటే ఎవర్నీ వదిలిపెట్టొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే కొత్తగూడెంలో హంగ్ ఏర్పడడంతో సీపీఐ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించారు. చైర్మన్ పదవిని సీపీఐకి, డిప్యూటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.