బండ్లగూడ, ఫిబ్రవరి 14: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ఏసీపీ తుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..సులేమాన్‌నగర్‌లో నివాసముంటున్న న్యాయవాది మహ్మద్ ఖదీర్(42) ఆన్లైన్ సేవల కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల రెండో పెండ్లి చేసుకొని మొదటి భార్యను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఆమె సోదరులు శనివారం మధ్యాహ్నం బావ ఖదీర్‌ను ఆయన ఆఫీసులో హత్య చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని హంతకుల కోసం గాలిస్తున్నారు. కాగా, న్యాయవాది ఖదీర్ హత్యను తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.