హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ర్టానికి సంబంధించిన జలహక్కులపై కేంద్ర జల్‌శక్తి శాఖను నిలదీస్తాం. నిధులివ్వాలని కోరుతాం. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తే సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తాం. ఎజెండాలో నుంచే తొలగించాలి. అప్పుడే సమావేశానికి హాజరవుతాం’ అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి చివరికి తుస్సుమన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా తెలంగాణకు ఉన్న జల హక్కులకు సీఎం చెల్లుచీటి రాసే నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర సంస్థలే బనకచర్ల వద్దని చెప్తుంటే, అందుకు భిన్నంగా దానిపై చర్చించేందుకు కమిటీ వేద్దామని ప్రతిపాదనలు పెట్టారు. ఆ తరువాత ఒప్పందాలు చేసుకుందామని సైతం బీరాలు పలకడమే ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తున్నది. ఏపీ, తెలంగాణ సీఎంలతో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఢిల్లీలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందు తెలంగాణ జలహక్కులకు సంబంధించి అన్ని అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్రానికి లేఖలు రాశారు. ఎజెండా అంశాలను చేర్చా రు. చివరికి బుధవారం 40 నిమిషాలపాటు సాగిన ఆ భేటీలో తెలంగాణ జలవివాదాలకు సంబంధించి ఏ అంశాన్ని వారు ప్రస్తావించలేదు.
పైగా తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు. భేటీ ప్రారంభం కాగానే ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారని తెలిసింది. గోదావరి నుంచి వేలాది టీఎంసీలు ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్నాయని, ఆ జలాలనే వాడుకుంటామని చెప్పినట్టు సమాచారం. సోదరభావంతో వివాదాలు లేకుండా సహకరించాలని కోరినట్టు చెప్తున్నారు. బనకచర్ల అంశం ప్రస్తావిస్తే సమావేశాన్ని బయ్‌కాట్ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. బనకచర్ల ప్రాజెక్టు వద్దే వద్దని ఖరాకండిగా చెప్పనేలేదని విశ్వసనీయ సమాచారం. బనకచర్లపై అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో దానితోపాటు, ఏపీ, తెలంగాణ ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు కమిటీ వేయాలని స్వయంగా ప్రతిపాదించారని తెలిసింది. వారంలోగా సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని, ఇరు రాష్ర్టాల మధ్య జలవివాదాలకు సంబంధించిన అన్నిఅంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక ఇస్తుందని, ఆపై అధికారుల స్థాయిలో పరిష్కరించుకునే అంశాలపై అక్కడే ఒప్పందాలు చేసుకుందామని కూడా సూచించినట్టు సమాచారం.