హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ ( Revanth Government ) రాష్ట్రంలో భూములు దోచుకోవడం అయిపోయింది. ఇక భూముల లోపల ఉన్న సంపద దోచుకొని, వారసత్వ కట్టడాలను ( Heritage Structur ) కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఈ మేరకు ఎక్స్ లో ఆరోపించారు. రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం దారుణమని అన్నారు.
మీటర్ల కొద్ది లోతులో తవ్వకాలు, బ్లాస్టింగ్స్ చేయడం వల్ల తెలంగాణ శిల్పకళకు ప్రతిరూపం, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాల యానికి, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు వాటిల్లనుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ సంపదను ధ్వంసం చేసే కుట్రలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి హాని చేసే ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.