Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్‌కు, కొరటాల శివ మార్క్ కథా కథనాలు, సామాజిక అంశాలు తోడైతే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో బాలకృష్ణను ఢీకొట్టే ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది.
యాక్షన్ సినిమాలతో పాటు విభిన్నమైన పాత్రల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్.. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. కొరటాల శివ రూపొందిస్తున్న కథలో ఈ విలన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, బలమైన వ్యక్తిత్వంతో పాటు ఇంటెన్స్ సన్నివేశాలు, పదునైన డైలాగులు ఉంటాయని టాక్. బాలకృష్ణ లాంటి మాస్ హీరోకు ఎదురుగా అదే స్థాయిలో స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడు ఉంటే సినిమాకు మరింత బలం చేకూరుతుందని దర్శకుడు భావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజశేఖర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రచారం ప్రకారం.. కొరటాల శివ స్వయంగా రాజశేఖర్‌ను కలిసి కథతో పాటు ఆయన పాత్ర తీరుతెన్నులను వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా విలన్ పాత్రలోని వైవిధ్యం, కథలో దానికి ఉన్న ప్రాధాన్యత రాజశేఖర్‌కు నచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఒకవేళ రాజశేఖర్ ఈ ప్రాజెక్టులో భాగమైతే మాత్రం బాలకృష్ణ, రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ నటులు ఒకే తెరపై ప్రత్యర్థులుగా కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతిని అందించే అంశంగా మారొచ్చు. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కొరటాల శివ శైలికి తగ్గట్టుగా సామాజిక అంశాన్ని కుటుంబ భావోద్వేగాలతో ముడిపెట్టి కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జోడించనున్నారని సమాచారం.