హుజూరాబాద్: ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నపుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, ప్రశ్నించిన వారందరిపైనా తప్పుడు కేసులు పెట్టించి, వేధించాడని రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య ఆరోపించారు. ఈ విషయంపై హుజూరాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తో కలిసి హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జానీ, సంపత్ లాంటి ఎంతో మందిపై పోలీసు కేసులు పెట్టించి, చిత్ర హింసలు పెట్టిన ఘనత ఈటల రాజేందర్‌దేనని అన్నారు. తాను బాధితులను తీసుకుని ఎప్పుడైనా.. ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమని.. దీనికి ఈటల సిద్ధమా? అని ప్రశ్నించారు.
రూ. 50 లక్షలతో కరపత్రాలు ముద్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని విమర్శించారు. ఈటల రాజేందర్ కేవలం కేసీఆర్ ఉద్యమం కారణంగానే ఎన్నికల్లో గెలిచి పదవులు పొందాడే తప్ప.. ఆయనకు ప్రజల్లో ఎలాంటి ఇమేజీ లేదన్నారు. ఈటలకు సొంత సంపాదన, ఆస్తులు కూడబెట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ, ఆసక్తి .. ప్రజలు, ప్రజా సమస్యలు అభివృద్ధిపై లేవని భూమయ్య దుయ్యబట్టారు. పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ అసలు నైజం బయటపడిందని చెప్పారు. హుజూరాబాద్‌లో ఈటల చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సర్కారు నిధులు మంజూరు చేసినా అయన పట్టించుకోలేదని, లబ్ధిదారులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆయన మాత్రం కోటలాంటి ఇంటిని నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈటల తాను చేసిన పాపాలకు తప్పకుండ శిక్ష అనుభవిస్తాడన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని భూమయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కర్ర రాజశేఖర్, కౌన్సిలర్ రమాదేవి, బత్తుల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.