
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 13 (నమస్తే తెలంగాణ): నివాసానికి అనుమతి పొందిన భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాజమానులు వచ్చే నెల 31లోగా తమ భవన వినియోగ క్యాటగిరీని మార్చుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్లైన్లోనే క్యాటగిరీని మార్చుకొనేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడువులోగా ఈ పని పూర్తిచేయకపోతే ఆయా భవనాల యజమానులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
మూడు క్యాటగిరీలుగా విభజన
నివాస భవనాల వినియోగ మార్పు కోసం స్వీయ ధ్రువీకరణ ఇచ్చేందుకు వాణిజ్య కార్యకలాపాలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. బేకరీలు, బ్యాంకులు, ఐటీ ఆఫీసులు, జిమ్‌లు, గెస్ట్‌హౌస్‌లు, నర్సింగ్‌హోంలు, విద్యాసంస్థలు తదితర 13 రకాల వ్యాపార కార్యకలాపాలను తొలి క్యాటగిరీలో చేర్చారు. పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, జ్యువెలరీ షాపులు, వస్త్ర దుకాణాలు, డిగ్రీ కాలేజీలు తదితర ఎనిమిది రకాల వ్యాపార కార్యకలాపాలను రెండో క్యాటగిరీలో పొందుపర్చారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్ల వ్యాపార కార్యకలాపాలను మూడో క్యాటగిరీలో చేర్చారు. ఈ క్రమంలో భవన వినియోగ మార్పు కోసం యజమానులు 1.25% శాతం లేదా 1.50% ఇంపాక్ట్ ఫీజుతోపాటు 33% కాంపౌండ్ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజుల వివరాలు
మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, హోల్‌సేల్ మార్కెట్లు, పెట్రోల్ స్టేషన్లు, గ్యారేజీలుగా కొనసాగుతున్న భవనాల యజమానుల నుంచి ఇంపాక్ట్ ఫీజు కింద ఫస్ట్ ఫ్లోర్ వరకు ప్రతి చదరపు అడుగుకు రూ.300 లేదా 6% (ఏది ఎక్కువగా ఉంటే అది) వసూలు చేస్తారు. రెండు నుంచి మిగిలిన అంతస్థులకు ప్రతి చదరపు అడుగుకు రూ 150 లేదా 3% చొప్పున వసూలు చేస్తారు. ఆవాసాలతోపాటు దవాఖానలు, నర్సింగ్ హోంలు, విద్యాసంస్థలు, ప్రజోపయోగ షాపులు (500 గజాలలోపు) ఇతర వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్న భవనాల యజమానులు ఇంపాక్ట్ ఫీజు కింద గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు ప్రతి చదరపు అడుగుకు రూ.100 లేదా 2% శాతం చెల్లించాల్సి ఉంటుంది. రెండో అంతస్థు నుంచి మిగిలిన అంతస్థులకు రూ.50 లేదా 1% చెల్లించాలి.
ఒకేసారి చెల్లిస్తే 10% రాయితీ
భవన వినియోగ మార్పు కోసం గడువులోగా స్వీయ ధ్రువీకరణ ఇచ్చి దరఖాస్తు సమయంలోనే మొత్తం ఫీజు చెల్లించేవారికి 10% రాయితీ ఇవ్వనున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. లేదంటే దరఖాస్తు సమయంలో 50% ఫీజు చెల్లించి మిగిలిన సగాన్ని వచ్చే ఏడాది మార్చి 31లోగా చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకొనేవారికి రాయితీ ఉండదని తెలిపారు. కాగా స్వీయ ధ్రువీకరణ కింద ఇప్పటివరకు 7 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
https://cr.ghmc. gov.in వెబ్సైట్లోకి వెళ్లి కమర్షియల్ యూసేజ్ అప్లికేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఓటీపీని ఎంటర్ చేశాక డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, వివరాలను నమోదుచేయాలి. ఫీజులను చెల్లించేందుకు చాలాన్ను జనరేట్ చేసి అందులో సూచించిన అకౌంట్‌కు నిఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ ఒకే అయిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్‌పై క్లిక్‌చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.