సిద్దిపేట, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బతుకమ్మ, దసరా పండుగలతో పాటు పల్లెల్లో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను అధికారులు శనివారం ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్త్తూ జీవోను విడుదల చేయడంతో దాని ప్రకారం రిజర్వేషన్లను ఆయా జిల్లాల్లో లాటరీ ద్వారా అధికారులు ఖరారు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 72 జడ్పీటీసీలు, 681 ఎంపీటీసీలు, 1613 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధ్దమైంది. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికార యంత్రాంగానికి రెండు రోజలు పాటు శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. త్వరలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఆశావహులు ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు, స్ట్రాంగ్‌రూమ్‌లు, చెక్‌పోస్టులు సిద్ధం చేశారు. అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చినవారు అప్పుడే రంగంలోకి దిగుతున్నారు. అనుకూలంగా రిజర్వేషన్ రానివారు డీలా పడ్డారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతున్నది. ఇంతకు ఎన్నికలు జరిగేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 72 జడ్పీటీసీలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 72 జడ్పీటీసీలు, 681 ఎంపీటీసీలు, 1613 సర్పంచ్‌లు, 14,098 వార్డులు ఉన్నాయి. మొత్తం 3801 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో…
జిల్లాల వారీగా చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో 26 జడ్పీటీసీలు, 230 ఎంపీటీసీలు, 508 సర్పంచ్‌లు, 4508 వార్డులు, 1291 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 6,55,958 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,34,186 మహిళలు, 3,21,766 మంది పురుషులు, 06 మంది ఇతరులు ఉన్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో 21 జడ్పీటీసీలు, 190 ఎంపీటీసీలు, 492 గ్రామ పంచాయతీలు, 4220 వార్డులు, 1052 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 5,23,327 ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,71,787 మహిళలు, 2,51,532 పురుషులు, 08 మంది ఇతరులు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో 25 జడ్పీటీసీలు, 261 ఎంపీటీసీలు, 613 సర్పంచ్‌లు, 5370 వార్డులు, 1,458 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 7,44,157 ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,75,855 మంది మహిళలు, 3,68,258 మంది పురుషులు, 44 మంది ఇతరులు ఉన్నారు.
జడ్పీ స్థానాలకు..
జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి గెజిట్‌ను విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జడ్పీలు ఉన్నాయి. వీటిలో సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు ప్రభుత్వం కేటాయించింది. మెదక్ జడ్పీ స్థానం జనరల్‌కు, సంగారెడ్డి జడ్పీ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించింది.
జిల్లా : జడ్పీ రిజర్వేషన్
సిద్దిపేట : బీసీ జనరల్
మెదక్ : జనరల్
సంగారెడ్డి : ఎస్సీ జనరల్