హనుమకొండ, నవంబర్ 14: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 18 నుంచి నిర్వహించే 1,3,5వ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేయూ రిసెర్చ్ స్కాలర్స్, విద్యార్థి సంఘాల నాయకులు పరిపాలన భవనంలోని వీసీ ప్రతాపరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డి.తిరుపతి మాట్లాడుతూ కేయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇంకా సిలబస్ పూర్తి కాలేదని, సిలబస్ పూర్తికాక ముందే పరీక్షలు నిర్వహిస్తే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారని దీంతో ఉత్తీర్ణత శాతం పడిపోతుందన్నారు.
సెలబస్ పూర్తిగా అయితేనే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, అప్పటివరకు పరీక్షలు వాయిదా వేయాలని, ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల కోసం బంద్ నిర్వహించడం, వర్షాలతో తరగతులు జరగకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదన్నారు. పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవడం కోసం కొంతకాలం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో కేయూ రీసర్చ్ స్కాలర్స్బోస్కో నాగరాజ్, ఏ.సూర్యకిరణ్, విద్యార్థి సంఘ నేతలు రోనాల్డ్, బి.శేఖర్ ఉన్నారు