మెదక్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేం ద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ గా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిప్రాంతాల్లో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.
లబ్ధిదారులకు అందని పౌష్టికాహారం…
మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో ఉండే గర్భిణులు, బాలింతలు, ఐదేండ్లలోపు పిల్లలు రక్తహీనతకు గురికాకుండా, శారీరకంగా బలహీనం కాకుండా ఉం డేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్డుతో పాటు ఆకుకూరలు, ఇతర కూరలతో పౌష్టికాహారం అందిస్తున్నారు. కేం ద్రాల్లో టీచర్లు ఉంటేనే అందరికీ పౌష్టికాహారం సక్రమంగా అందతుంది. అంతేకాదు ఆరోగ్య, ఇతర సర్వే ల బాధ్యతలను ఎక్కువగా అంగన్వాడీ టీచర్లకే అప్పగిస్తుంటారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతున్నది. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో టీచర్లే ఆ భా రాన్ని మోస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా లు లేని కేంద్రాల్లో టీచర్లకు సర్వే బాధ్యతలు అప్పగించడంతో కేంద్రాలు మూతబడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మహిళలు కోరుతున్నారు.
జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు…
మెదక్ జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నా యి. అందులో అల్లాదుర్గం, మెదక్, నర్సాపూర్, రా మాయంపేట ఉన్నాయి. వీటిలో 0 నుంచి 3 సంవత్సరాలలోపు చిన్నారులు 31,286 మంది, 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలు 22,299 మంది చొప్పున మొత్తం 53,585 మంది ఉన్నారు. మెదక్ జిల్లాలో 5,293 మంది గర్భిణులు ఉండగా, బాలింతలు 4,651 మంది ఉన్నారు. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 1076 మంది అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. అల్లాదుర్గంలో 230 సెంటర్లు పనిచేస్తుండగా, మెదక్‌లో 278 సెంటర్లు, నర్సాపూర్‌లో 288 కేంద్రాలు, రామాయంపేటలో 280 సెంటర్లు ఉన్నాయి. మొత్తం 1076 కేంద్రాలకు గాను 1,043 మంది టీచర్లు ఉన్నారు.
ఇందులో 33 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఆయాలు 793 మంది ఉండగా, ఆయా పోస్టులు 283 ఖాళీగా ఉన్నాయి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు విద్యార్హతను పెంచింది. అంగన్వాడీ టీచర్‌తో పాటు ఆయాలుగా ఉద్యోగాలకు నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలని అని నిబంధన పెట్టింది. వయో పరిమితి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. 65 ఏండ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం ఆయాలకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ వచ్చాకే భర్తీ…
జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర కమిషనరేట్ నుంచి నోటిఫికేషన్ రావా ల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులను భర్తీ చేస్తాం. ఇప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు సేకరించాం. ఆయాలు లేని కేంద్రాల్లో టీచర్లే పనిచేస్తున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం.
– హైమావతి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి మెదక్