Junior Colleges | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ ) : మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 217 కాలేజీలకు ఊరట లభించింది. రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ మినహాయింపు గత విద్యాసంవత్సరంతో ముగిసింది.
ఈ ఏడాది ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు దకకపోవడంతో విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. ఈ కాలేజీల్లో సెకండియర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థుల విషయంపై మాత్రం ఎటూ తేల్చలేదు. ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతివ్వాలన్న ప్రైవేట్ కాలేజీల విజ్ఞప్తితో ఈ ఒక విద్యాసంవత్సరానికి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70 వేల మంది విద్యార్థులకు ఊరట కలిగింది.