హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వానలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు కేంద్రం నయాపైసా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే రూ.1000 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,937 కిలోమీటర్ల మేర రహదారులను 5 నెలల్లోగా రిపేర్ చేసి తారు వేయనున్నది. ఈ నెల చివరి నాటికి టెండర్ల ప్రక్రియను ముగించి, 510 పనులకు వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు రోడ్లు, భవనాలశాఖ సిద్ధమవుతున్నది.
జనవరి తొలివారంలో పనులు మొదలుపెట్టి, 2022 మే నాటికి పూర్తిచేసే దిశగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఈఎన్సీ రవీందర్రావు తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలంలో భారీ వా నలు కురవటంతో చాలా చోట్ల వాగులు పొంగి వరదలు వచ్చి రోడ్లు దెబ్బతిన్నాయి. అనేక రోడ్లకు గం డ్లుపడ్డాయి. తక్షణ చర్యగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. విపత్తులతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేయటానికి విపత్తుల నిధి నుంచి నిధులు ఇచ్చి కేంద్రం ఆదుకోవాలి. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రోడ్లు, భవనాలశాఖ అధికారులతో సమావేశమైనా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ‘రోడ్లు బాగోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం పైసలు ఇచ్చే ఆలోచనలో లేదని స్పష్టమవుతున్నది. మీరు పనులు మొదలుపెట్టండి. రోడ్లన్నీ బాగు చేయండి. కావాల్సినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది’ అని స్పష్టం చేశారు. ఆ వెంటనే అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలతో రూ.1000 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. తాజాగా ఆర్థిక శాఖ ఆర్అండ్బీ శాఖకు నిధులు విడుదల చేసింది.
32 జిల్లాల్లో 2,937 కిలోమీటర్ల రోడ్లు
జిల్లాలవారీగా రిపేర్లు చేసి, తారు వేయాల్సిన రోడ్ల నివేదికను ఆర్‌అండ్‌బీశాఖ తయారుచేసింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు కలిపి పాత జిల్లాలవారీగా 9 సర్కిల్స్ ఉన్నాయి. వాటి వివరాల ను పక్క టేబుల్లో చూడవచ్చు.