హైదరాబాద్: కొన్ని ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తెలిపారు. ఎన్డీటీవీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రాంతీయ పార్టీలకు.. ఎన్డీఏ లేదా ఇండియా కూటమి సపోర్టు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ రెండు అంకెల సీట్లను గెలుస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని, బీజేపీకి గెలిచే అవకాశాలు లేవన్నారు. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తరపున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్.. కొత్తగా ఏర్పడబోయే కేంద్ర సర్కారులో నాగేశ్వర్ రావు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఎన్డీఏకు లేదా ఇండియా కూటమికి సపోర్టు ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బదులిస్తూ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఆశ్చర్యం జరగబోతున్నట్లు వెల్లడించారు. ఆ ఆశ్చర్యాన్ని మీరు నమ్మలేరని, ఈసారి దేశంలో ఓ కొత్త విషయం చోటుచేసుకోనున్నదని, ప్రాంతీయ పార్టీలన్నీ చాలా బలంగా ఉన్నాయని, ఆ పార్టీలన్నీ ఓ శక్తిగా ఆవిర్భవించనున్నాయని, రీజినల్ పార్టీలు.. ఏన్డీఏకు లేదా ఇండియా కూటమికి సపోర్టు ఇవ్వడం కాదు, ఈసారి ఇలాంటిది ఏమీ ఉండదని, కానీ ఆ రెండు గ్రూపుల్లో ఎవరో ఒకరు ప్రాంతీయ పార్టీల కూటమికి సపోర్టు ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రివర్స్ జరగబోతున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలను గడిచిన ఆరు నెలలుగా నెరవేర్చలేదని, రేవంత్ రెడ్డి సర్కారు పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. కేవలం ఒకే ఒక్క హామీ నెరవేర్చారని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారన్నారు. అది కూడా ఓ జోక్ అయ్యిందని, బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్నారని, ఆటో డ్రైవర్లు నిరసనలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు. రైతాంగం కూడా రేవంత్ సర్కారు పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు. రైతులు తమ పాలన సమయంలో ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని, ప్రస్తుతం వాళ్లు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందన్నారు.
తమ ప్రభుత్వం తాగు నీరు, వ్యవసాయ నీరు, నిరంతర విద్యుత్తును అందించిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలకు ప్రజలు ఆకర్షితులైనట్లు కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చాలా అట్రాక్టివ్ ప్రామిస్‌లు చేసిందని, కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య ఓటు షేర్ కేవలం 1.8 శాతం మాత్రమే ఉందని, తాము మూడవ వంతు సీట్లు గెలిచామన్నారు. కేసీఆర్ కన్నా ఎక్కువ కాంగ్రెస్ చేస్తుందని ప్రజలు భావించారని, కానీ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజల్ని మోసం చేసిందని ఆయన తెలిపారు.
కొందరు నేతలు బీఆర్ఎస్ను వీడిన అంశంపై స్పందిస్తూ.. కొంత మంది మాత్రమే పార్టీని వీడారని, అధికారం మారినప్పుడు ఇవన్నీ సహజమే అని, ప్రతి పార్టీలోనూ కొన్ని పొద్దుతిరుగుడు పువ్వులుంటాయని, అవి సూర్యుడి ఎటు ఉంటే అటే చూస్తాయని, అందుకే కొందరు పార్టీ వీడినట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని, వాళ్లకు ఒక్క సీటు కూడా రాదు అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి తన ఛరిస్మాను కోల్పోయారని, ప్రజలు దీన్ని గ్రహించారని, రూపాయి విలువ చాలా బలహీనపడిందని, రైతులు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ఇవాళ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందని, తన కూతురికి కూడా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలస్కీ స్కామ్ అనేది అసలు స్కామే కాదు అని, ప్రతి రాష్ట్రానికి లిక్కర్ పాలసీ ఉంటుందని, ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని.. కేజ్రీవాల్‌ను, కవితను అరెస్టు చేసి బీజేపీ డ్రామా చేస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.