సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడి చర్యలను జీహెచ్ఎంసీ వేగిరం చేసింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రసాయనాలు చల్లిస్తున్నది. మొత్తంగా 30 సర్కిళ్లలో రోజూ దాదాపు 200 లీటర్ల రసాయనాలను అధికారులు స్ప్రే చేయిస్తున్నారు. ఇందుకోసం ఆరు జోన్లలో సుమారు 500లకు పైగా సిబ్బందిని నియమించారు. డీఆర్ఎఫ్, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తాధ్వర్యంలో కరోనా కట్టడికి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు.. ఇప్పటికే 5,26,585 గృహాలలో 4,606 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు.
పిచికారీ చేస్తున్న ప్రాంతాలు..
పాజిటివ్ వస్తున్న ప్రాంతాలు, వాటి పరిసర ప్రాంతాలు, కొవిడ్ టెస్టింగ్ సెంటర్లు, పీహెచ్సీఎస్, సీహెచ్సీఎస్లతో పాటు గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ వైద్యశాలలతో పాటు అన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలు, కార్పొరేట్ దవాఖానలు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, ఏటీఎం సెంటర్లు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రతినిత్యం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లుతున్నారు. అంతేకాక అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మసీదులు, చర్చీలు, దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
సర్కిల్‌కు రెండు ఐసొలేషన్ కేంద్రాలు
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకు సర్కిళ్ల వారీగా హోం ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. గతేడాది సర్కిల్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో పడకలు, ఆహార వసతులు, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సర్కిల్‌కు మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కమ్యూనిటీ హాల్, కల్యాణమండపం, ఫంక్షన్‌హాళ్లను అధికారులు ఎంపిక చేస్తున్నారు.
పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం..
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మార్కెట్లు, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నాం. ఇప్పటికే నగరంలో దాదాపుగా 99 శాతం ఫస్ట్, సెకండ్ డోస్ టీకా పక్రియను పూర్తి చేశాం. పెరుగుతున్న కేసుల తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నాం. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో మరిన్ని ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నాం. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-2111 1111 ద్వారా 24 గంటల పాటు సేవలు అందిస్తున్నాం. కరోనాతో ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. స్వీయ జాగ్రత్తలతో మహమ్మారిని కట్టడి చేయవచ్చు. ప్రతిఒక్కరూ మాస్కులతో పాటు సామాజిక దూరం పాటించాలి.