రాత్రంతా నిశ్శబ్దాన్ని యుద్ధంగా మోస్తూ
పగలు సన్నగా నవ్వుతుంది
ఆ వక్రరేఖ పైన భారంగా
వాలిన వక్రబుద్ధులను బేరీజు వేస్తూ
యుద్ధం తప్పదని తెలిసాక చేతిగాజులకు
పోరాటం నేర్పుతుంది
కడుపులో సముద్రమంత కన్నీళ్లను దాచి
తెల్లని నురుగులా మెల్లగా నవ్వుతుంది
తెల్లవారాక ఆవిరవుతాయేమో అన్న ఆశతో
కాలాలెన్ని మారుతున్నా
ఆమె కాలం వైపే కాళ్ళు చాపుకు కూర్చుంటుంది
వసంతమేదైనా కోకిలై కొత్తరాగమేదో తీస్తుందని
ఆమె ఆశకు ఎవరైనా ఆయువు పోయండి
నీ ఆయుష్షుకి ఆమె ఆశీర్వాదం ఆయువుపట్టు
స్వేచ్చగా ఎగరాలనుకుంటుంది..
ఆమె రెక్కలకు ఊతం ఇవ్వండి
ఊపిరున్నంత వరకు
నీ చిరునామా చెప్పుకుంటుంది
ఆమె కలలకు హద్దులు గీయకండి..
వీలైతే మీరు ఒక కల కనండి
కాదనుకుని తాను చేయడానికి కన్నీళ్లేం అడ్డుకాదు
నీపై ఆమెకున్న గౌరవమే అడ్డుకట్ట
నిజానికి ఆమె కోరుకునేది
ఆకాశంలో సగం భాగమో,
ఆస్తుల్లో అర్ధభాగమో కాదు
రంగాలేదైనా రాణిస్తుందన్న నమ్మకాన్ని
సాటి మనిషిగా గౌరవాన్ని
సమాజంలో సమానంగా జీవించే హక్కుని…
పి.సుష్మ
99597 05519