‘ఇదే నా మాట.నా మాటే శాసనం’ అన్న తీరుగా ఇన్నాళ్లూ బీజేపీలో అంతా తానే అన్నట్టు వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోదీ శకం ముగిసిందా? మోదీ ఆదేశాలను శిరసావహించడం.. ఆయన కన్నెర్రజేస్తే భయపడిపోతూ జీహుజూర్ అనేటువంటి రోజులు కనుమరుగయ్యా యా? ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన జగ్దీప్ ధన్‌ఖడ్ ఎపిసోడ్‌ను చూస్తే ఈ అనుమానాలు నిజమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీపై ధిక్కారానికి ‘ధన్‌ఖడ్’ ఎపిసోడ్ తొలి మెట్టుగా వాళ్లు అభివర్ణిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీతో పొసగకపోవడం వల్లే ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతంతో ఇది పతాక స్థాయికి చేరిందని అంటున్నాయి. నోట్ల కట్టల కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన చర్యలకు నేతృత్వం వహించాలని అధికార బీజేపీ అనుకొన్నది. ఈ క్రమంలోనే సోమవారం లోక్‌సభలో చర్యలకు ఉపక్రమించింది. అయితే, రాజ్యసభలో విపక్షాలు ఇదే విషయాన్ని తొలుత లేవనెత్తడం, తమతో చర్చించకుండానే ధన్‌ఖడ్ విపక్షాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం మోదీకి రుచించలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
దీంతో ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి మోదీ ఆదేశించారని, ఇది తెలిసే.. తనకు తానుగా అప్పటికప్పుడు ధన్‌ఖడ్ రాజీనామా నిర్ణయాన్ని తీసుకొన్నారని సమాచారం. అవిశ్వాస తీర్మానం పేరిట ధన్‌ఖడ్‌కు మోదీ ముకుతాడు వేయాలని ప్రయత్నించారని.. అయితే, మోదీని ధిక్కరిస్తూ రాజీనామా చేసి తాను ఎవరికీ లొంగబోనన్న సంకేతాలను ధన్‌ఖడ్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా గడిచిన 11 ఏండ్లలో మోదీ ధిక్కారానికి ‘ధన్‌ఖడ్’ ఉదంతాన్ని తొలి మెట్టుగా చెప్తున్నారు. కాగా పదకొండేండ్ల మోదీ నాయకత్వానికి ధన్‌ఖడ్ రాజీనామా ‘బ్లడ్ ఆన్ కార్పెట్’ (ధిక్కారం) లాంటిదేనని ‘ది ఫెడరల్’ ఇంగ్ల్లిష్ పత్రిక సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కే సహాయ్ అభివర్ణించారు.
వీడ్కోలు లేకుండానే..
మోదీతో వైరం కారణంగానే.. రాజీనామా అనంతరం ధన్‌ఖడ్‌కు బీజేపీ నేతలు ఎటువంటి వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని విశ్లేషకులు చెప్తున్నారు. ధన్‌ఖడ్ రాజీనామాకు సంబంధించి కేవలం 26 పొడి పదాలతో మోదీ మొక్కుబడిగా ట్వీట్ చేయడం, ఆ ట్వీట్‌లోనూ.. దేశానికి సేవ చేయడానికి ధన్‌ఖడ్‌కు తమ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నట్టు చెప్పుకోవడం అటు బీజేపీ వర్గాలను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘ధన్‌ఖడ్ రాజీనామాకు సంబంధించి హఠాత్తుగా ఏం జరిగిందన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే ప్రధాని ట్వీట్‌ను విశ్లేషిస్తే ఏదో తీవ్రంగానే జరిగినట్టు కనిపిస్తున్నది. ట్వీట్‌ను బట్టి ధన్‌ఖడ్‌పై మోదీకి చిరాకు, కోపం ఉన్నట్టు అర్థమవుతున్నది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ ఎంపీ ఒకరు పేర్కొన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతంపై బీజేపీ అధినాయకత్వానికి, ధన్‌ఖడ్‌కు మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగిందని, ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. విపక్షాల తీర్మానాన్ని రాజ్యసభలో ధన్‌ఖడ్ ఆమోదించడం ప్రభుత్వానికి అవమానకరంగా మారిందని, ధన్‌ఖడ్ ఇదంతా కావాలనే చేశారని సీనియర్ కేంద్రమంత్రి ఒకరు ఆరోపించారు.
ధన్‌ఖడ్‌పై మోదీకి విశ్వాసం సన్నగిల్లడం వల్లే రాజీనామా తెరమీదకు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అభిప్రాయపడ్డారు. తన మాట విన్నంత వరకే మోదీ ప్రభుత్వం సఖ్యతగా ఉంటుందని.. అలా లేని నాడు సాగనంపడమే ఉంటుందని అన్నారు. ధన్‌ఖడ్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రైతుల సమస్యలు, ఎమ్మెస్పీపై కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ధన్‌ఖడ్ గతంలో బహిరంగంగా నిలదీశారు. న్యాయవ్యవస్థపై విమర్శలు చేయడంతో పాటు జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వ్యవహారంలో విపక్షాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ధన్‌ఖడ్ లక్ష్మణ రేఖను దాటి ప్రవర్తించారని.. బీజేపీ భావించిందని అందుకే ఆయనను సాగనంపేలా చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముందస్తు షెడ్యూల్ లేకుండానే..
రాజీనామాకు ముందు ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే ధన్‌ఖడ్ రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను అందించారని సమాచారం. అరగంట తర్వాత రాజీనామా లేఖను ధన్‌ఖడ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సాధారణంగా రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే వారి షెడ్యూల్ చాలా రోజుల ముందుగానే సిద్ధమౌతుంది. అలాంటిది ఒక సీనియర్ రాజ్యాంగ నేత ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా రాష్ట్రపతి భవన్‌కు రావడంతో అక్కడి సిబ్బంది ఒకింత ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తున్నది. ధన్‌ఖడ్ రాకతో అప్రమత్తమైన రాష్ట్రపతి భవన్ సిబ్బంది.. అప్పటికప్పుడు వీరి భేటీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. దీంతో రాజీనామాపై ధన్‌ఖడ్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొన్నారా? అనే చర్చ సాగుతున్నది.