e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News రియల్‌ జోష్‌

రియల్‌ జోష్‌

  • మారుమూల గ్రామాల్లోనూ పుంజుకుంటున్న అమ్మకాలు
  • ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ బహుళ అంతస్తుల నిర్మాణం
  • సంపన్నుల కోసం అందమైన విల్లాలు
  • మధ్య తరగతికీ అందుబాటులో ధరలు
  • నిరుపేదలకు ‘డబుల్‌ బెడ్‌రూమ్‌’ల అండ
  • భారీ ప్రాజెక్టులు చేపడుతున్న నిర్మాణ సంస్థలు
  • భవిష్యత్‌లో సామాన్యులకు అందనంత ధరల్లో ప్లాట్లు
  • పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో భూమి బంగారం
  • భారీగా వెలుస్తున్న వెంచర్లు
  • సంగారెడ్డి జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ భూం

కరోనా సమయంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇప్పుడు జోరు మీదున్నది. భారీ టవర్లు, బహుళ అంతస్తులు, విల్లాలు, డూప్లెక్స్‌లతో సంగారెడ్డి జిల్లా కొత్తరూపును సంతరించుకుంటున్నది. హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదుగుతున్న తరుణంలో అన్నివర్గాల ప్రజలు సమీపంలోని సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల వైపు చూస్తున్నారు. సాధారణ, మధ్యతరగతితో పాటు ఉన్నత వర్గాల వారూ ఇక్కడ స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ముంబయి జాతీయ రహదారి, ఔటర్‌ రింగురోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో వెంచర్లు, భారీ స్థిరాస్తి ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. వీటికి హెచ్‌ఎండీఏ, రేరా అనుమతులు ఉండడంతో కొనుగోలుదారులకు బ్యాంకులు త్వరగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, ఇస్నాపూర్‌, ముత్తంగి, రుద్రారం, పటాన్‌చెరు, ఆర్సీపురం, బొల్లారం, కిష్టారెడ్డిపేట్‌లో భూములు బంగారంలా మారాయి. నిన్న మొన్నటి వరకు పూర్తి పల్లె వాతావరణంలో ఉన్న పలు గ్రామాలు.. ప్రస్తుతం కార్పొరేట్‌ స్కూల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌, క్రీడామైదానాలతో పట్టణాలను తలపిస్తున్నాయి. దీంతో అనేక మంది ఇక్కడి భూములపై పెట్టుబడులు పెడుతున్నారు.

పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ తీసుకోవాలని శని, ఆదివారాల్లో వేలాది మంది కస్టమర్లు కార్లలో ఈ ప్రాంతానికి వస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో అన్ని గ్రామాల్లోనూ వెంచర్లు, భారీ టవర్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన స్థిరాస్తి వ్యాపార దిగ్గజాలు కూడా కొల్లూరు, తెల్లాపూర్‌, ఉస్మాన్‌నగర్‌లో తమ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. పటాన్‌చెరు, జిన్నారం, అమీన్‌పూర్‌, గుమ్మడిదల, రామచంద్రాపురం మండలాల్లోని ప్రతీ గ్రామంలో పెద్ద సంఖ్యలో హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఔట్లతో వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. కంది, సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో కూడా అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఫార్మా పరిశ్రమలు, పారిశ్రామికవాడల్లో పనిచేసే వారి స్థాయికి తగ్గట్టుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండిపెండెంట్‌ హౌస్‌లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల రుణాలు ఇస్తుండటంతో ఉద్యోగులు కూడా వాటిని ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతుల్లో కొనుగోలు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ డీటీసీపీ, రేరా అనుమతులు ఉండటంతో బ్యాంకులు కూడా త్వరగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఓడీఎఫ్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ఐఐటీలు, గీతం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కొలువుదీరడంతో ఎడ్యుకేషన్‌ హబ్‌గాను ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. జహీరాబాద్‌లో నిమ్జ్‌ , పటాన్‌చెరు, బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, పాశమైలారంలో వేలాది పరిశ్రమల ద్వారా ఉపాధి లభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే ప్లాట్లు కొనిపెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో నివసిస్తున్న ధనవంతులు, మధ్యతరగతి వారు నగర శివారులో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు వస్తాయని ఆశించి రియల్‌ రంగంలో అడుగుపెడుతున్నారు.
పటాన్‌చెరు, నవంబర్‌ 24: పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఇంటి జాగా కొనాలని డబ్బులు జమచేసుకుంటున్నారా.? అయితే వెంటనే ఎక్కడో ఒకచోట కాస్త అటు, ఇటు అయినా ప్లాట్‌ను కొనేయండి. ఇప్పుడు ఆలోచిస్తే ఇంకెప్పుడూ కొనలేరు అని స్థిరాస్తి నిపుణులు సూచిస్తున్నారు. ఒక వైపు నుంచి విశ్వనగరం హైదరాబాద్‌ వేగంగా విస్తరిస్తున్నది. అందులో ప్రధానంగా సంగారెడ్డి పట్టణం వైపు శరవేగంగా దూసుకువస్తున్నది. నగరంలో ఏ దిక్కునా జరగని అభివృద్ధి సంగారెడ్డి పరిసరాల్లో జరుగుతున్నదని అంతర్జాతీయ భౌగోళిక నిపుణుడు కెవిన్స్‌ హేన్స్‌ ట్వీట్‌ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కరోనా కష్టకాలం తరువాత కూడా రియల్‌ వ్యాపారం నిలదొక్కుకుని ముంబయి జాతీయ రహదారి, ఔటర్‌ రింగురోడ్డుకు ఇరుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాల్లో భారీ స్థిరాస్తి ప్రాజెక్టులు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో నిర్మాణాలు జరుగుతున్నాయి. తెల్లాపూర్‌, అమీన్‌ఫూర్‌, బొల్లారం గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారాయి. ఒకప్పుడు వేలల్లో జనాభా ఉన్న ఈ పంచాయతీలు ఇప్పుడు లక్షల జనాభాతో మున్సిపాలిటీలుగా శరవేగంగా అభివృద్ధి చెందాయి. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.10 నుంచి 20కి పైగా అంతస్తులతో భారీ టవర్లు, స్పేస్‌ స్టేషన్లు, బహుళ అంతస్తులు, విల్లాలు, డూప్లెక్స్‌లు వెలుస్తున్నాయి. మధ్యతరగతి కొనుగోలు చేసేలా ప్లాట్లు, ఇండిపెండెంట్‌ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో నిరుపేదలకు నివాస యోగ్యత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. కొల్లూరులో 15వేల డబుల్‌ బెడ్‌రూంలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -

ఇప్పుడే సరైన సమయం..

ఇప్పుడు కాదంటే ఇంకెప్పుడు కొనలేమని ప్రాపర్టీ నిపుణులు మధ్య తరగతి వారికి సూచిస్తున్నారు. కొద్దిపాటి అప్పు చేసైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలని అంటున్నారు. ఈ రంగంలో రెండేండ్లలో రెట్టింపు ఆదాయం రావడమనేది సాధారణ విషయంలా మారింది. పటాన్‌చెరు మండలంలోని చాలా గ్రామాల్లో మొదటి కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారు రెండింతల లాభాలు ఆర్జించినట్లు సమాచారం. రూపాయి పెడితే మూడింతలు, నాలుగింతల రాబడి వస్తున్నదని ప్లాట్లు కొన్నవారు అంటున్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, పల్లె ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు అవుతుండటంతో పట్టణాలకు దీటుగా సౌకర్యాలు ఉంటున్నాయి. పలుచోట్ల కార్పొరేట్‌ స్కూల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభం అవుతున్నాయి. మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌, క్రీడామైదానాలు అందుబాటులోకి వస్తున్నాయి. జాతీయ రహదారులపై, రింగురోడ్డు చుట్టూ కార్పొరేట్‌ దవాఖానలు ప్రారంభం అవుతున్నాయి. రవాణా సౌకర్యం, ఇంటర్నెట్‌ గ్రామాలకూ విస్తరించడంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తే ఇంటికే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఆహారాన్ని తెస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు ఇంటికే వస్తువులను తెచ్చి ఇస్తున్నాయి. నగర శివారులో ప్రకృతికి దగ్గరగా, సౌకర్యవంతంగా ఉండే అవకాశముండడంతో ఈ ప్రాంతం ప్రజలను ఆకట్టుకుంటున్నది. ఇరుకిరుకు నగర జీవితాలకంటే హెచ్‌ఎండీఏ డీటీసీపీ లే ఔట్‌ రియల్‌ ప్రాజెక్టుల్లో స్థలాలు కొని ఇండ్లు నిర్మించుకోవడం ఉత్తమమని గుర్తిస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇప్పుడు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కొత్త ప్రాజెక్టులు ఏవి వచ్చినా వారు అనుకున్న సమయంకంటే ముందుగానే అమ్ముడుపోతున్నాయి. దీంతో రియల్టర్లు, బిల్డర్లు, స్థిరాస్తి అమ్మకాల సంస్థలు సంగారెడ్డి జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టాయి.

డబుల్‌ బెడ్‌రూంలపై ఆశలు..

పటాన్‌చెరు నియోజకవర్గంలో కొల్లూర్‌లో 15వేల డబుల్‌ బెడ్‌రూంలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. పనులు దాదాపు చివరి దశలో ఉన్నాయి. నగరంలో ఉన్న నిరుపేద వర్గాలకు వీటిని అందజేయనున్నారు. ఈ డబుల్‌ బెడ్‌ రూంలు అందుబాటులోకి వస్తే దాదాపు 70వేల నుంచి 80వేల జనాభా ఇక్కడ నివసిస్తారు. కొల్లూరు గ్రామం పెద్దపట్టణంలా మారుతుంది. అలాగే, కర్దనూర్‌, ఇంద్రేశం, అమీన్‌పూర్‌లోనూ డబుల్‌బెడ్‌రూంలను నిర్మిస్తున్నారు. నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కేటాయించడం పరిశ్రమలకు వరంలా మారనుంది. ఇక్కడ కార్మికులు కూడా అందుబాటులో ఉండనున్నారు. ప్రభుత్వం తాగునీరు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్‌ తదితర సౌకర్యాలను యుద్ధ ప్రతిపాదికన కల్పిస్తున్నది. ఇక తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, ఇస్నాపూర్‌, ముత్తంగి, రుద్రారం, పటాన్‌చెరు, ఆర్సీపురం, బొల్లారం, కిష్టారెడ్డిపేట్‌లో భూములు బంగారంలా మారాయి. ఈ రియల్‌ భూం కారణంగా మరో రెండేండ్లలో ధరలు మధ్యతరగతికి అందనంత దూరంలో ఉంటాయని తెలుస్తున్నది. కొసమెరుపేమిటంటే రెండేండ్ల్ల క్రితం తమవద్ద ప్లాట్లు కొన్నవారికి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల ప్రతినిధులు ఫోన్‌చేసి ఆ ప్లాట్లను తిరిగి తమ సంస్థకు అమ్మితే రెట్టింపు ధర ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారట. లేదంటే వారు కట్టబోయే అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కేటాయిస్తామని ఆకర్షణీయమైన ప్రతిపాదనలు చేస్తున్నారట.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement