వ్యవసాయ భూములను ఫామ్ ల్యాండ్స్ పేరిట విక్రయిస్తూ రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతునే ఉన్నాయి. గంధపు చెట్లతో కూడిన ఫామ్ ల్యాండ్స్ అంటూ టీవీలు, ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నమ్మి కొనుగోలు చేసినవారిని నిండా ముంచుతున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట రియల్ ఎస్టేట్ సంస్థలు అమాయక ప్రజలను మోసం చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది అప్రమత్తం కావడంలేదు. హైదరబాద్‌లోని సాఫ్ట్వేర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఫామ్ ల్యాండ్స్ పేరిట వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో వెంచర్లను ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయిస్తు దోచుకుంటున్నారు. ఫామ్ ప్లాట్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నిబంధనల ప్రకారం అర ఎకరంపైగా ఫామ్ ల్యాండ్స్‌ను విక్రయించాల్సి ఉన్నప్పటికీ, నిబంధనలను విరుద్ధంగా తక్కువ మొత్తంలో విక్రయిస్తూ అటు అమాయక ప్రజలకు, ఇటు సర్కారుకు నష్టం కలిగిస్తున్నారు.
– వికారాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ)
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేసిన తర్వాతనే ప్లాట్లుగా విక్రయించాల్సి ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు ల్యాండ్ కన్వర్షన్ పూర్తి కాకుండానే ఫామ్ ల్యాండ్స్ పేరిట గుంటల చొప్పున విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్దఎత్తున నష్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ఫామ్ ల్యాండ్స్ పేరిట వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్లో లేఅవుట్‌ను చూపిస్తూ ఫార్మ్ ల్యాండ్‌లోని శ్రీగంధపు మొక్కలు ఆరేడేండ్లలో గంధపు చెట్లుగా మారి మీకు లాభాలు కూడా వస్తాయంటూ తీపి మాటలు చెప్పి ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఇదంతా ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోలకు తెలిసే జరుగుతున్నా.. రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ముడుపులు అందుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు అని తెలిసి ప్రతీ రిజిస్ట్రేషన్‌కు కొంత ఇవ్వాలంటూ రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో డీల్ కుదుర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నా.. వారికి సహకరిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల జిల్లాలో ఫామ్ ల్యాండ్ పేరిట వెలసిన ఓ వెంచర్ అమాయక ప్రజలను మోసం చేసింది. మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామ పరిధిలో 300 ఎకరాల్లో ఫార్మ్ ల్యాండ్ వెంచర్‌ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేసింది. 300 ఎకరాల్లో ఒక్క గుంట నుంచి 10 గుంటల వరకు ఫామ్ ల్యాండ్స్ పేరిట భూములను విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులతోపాటు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన ప్రచారానికి ఆకర్షితులై గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్స్‌ను కొనుగోలు చేశారు. సంబంధిత వెంచర్లో కొనుగోలు చేసిన వారందరికీ తుమ్మలపల్లిలో భూమిని చూపించారే తప్ప బాధితులు కొనుగోలు చేసిన ఫామ్ ల్యాండ్స్ ఎక్కడనే పొజిషన్ మాత్రం చూపించకుండా గత మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారు. సర్వే నెంబర్లు ముద్రించి ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ సర్వే నెంబర్లు ఎక్కడున్నాయో తెలియక, కొనుగోలు చేసిన ఫామ్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో పొజిషన్ లేకపోవడంతో ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు చేసిన సుమారు 100మంది బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
జిల్లామీదుగా రీజినల్ రింగ్‌రోడ్డు వెళ్తుండటంతో అమాయక ప్రజలను మోసం చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ప్రధానంగా జిల్లాలోని మోమిన్‌పేట్, పూడూరు, ధారూరు, పరిగి, నవాబుపేట, వికారాబాద్ మండలాల్లో ఫామ్ ల్యాండ్స్ పేరిట వెంచర్లు వెలిశాయి. ఫామ్ వెంచర్లలో ఐదు, పది గుంటల చొప్పున ఒక ప్లాట్‌ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్‌ను తప్పనిసరిగా 20 గుంటలపైనే విక్రయించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే గుంట మొదలుకొని 15 గుంటల వరకు ప్లాట్లుగా ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. గుంటల చొప్పున ఏర్పాటు చేస్తున్న ఒక్కో ప్లాట్‌కు రూ.20 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు రావని తెలిసినప్పటికీ నిర్మాణ అనుమతులు ఫామ్ ల్యాండ్స్‌కు అవసరం లేదంటూ ప్లాట్లను విక్రయిస్తుండటం గమనార్హం. ఫామ్ ల్యాండ్స్‌ను కొనుగోలు చేస్తున్న అమాయక ప్రజలు అసలు అనుమతులు ఉన్నాయా లేదా, భవిష్యత్తులో ఇతరులకు విక్రయించాల్సిన పరిస్థితులు వస్తే అవకాశం ఉంటుందా అనే ఎలాంటి వివరాలను తెలుసుకోకుండానే కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. ఫామ్ ల్యాండ్స్‌ను కొనుగోలు చేసేవారికి ఏమాత్రం అనుమానం రాకుండా ఆన్లైన్లోనే అన్ని అనుమతులున్నాయంటూ నమ్మిస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనూ అందరికీ పెద్దమొత్తంలో ముట్టజెప్పుతూ అసలు విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడుతూ మోసం చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ అని తెలిసి కూడా ఆయా మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చే మామూళ్లతో గుంటల చొప్పున రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు ఫామ్ ల్యాండ్స్ ప్లాట్లలో శ్రీగంధం చెట్లను తామే పెంచుతామని, పంట చేతికి వచ్చిన తర్వాత యజమానికి, ప్లాట్ కొనుగోలుదారులకు సమాన భాగస్వామ్యం ఉంటుందంటూ మభ్యపెడుతున్నారు.
జిల్లాలోని ధారూరు మండలం రాజాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన ఫామ్ ల్యాండ్‌పై రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. సంబంధిత గ్రామ రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఫామ్ ల్యాండ్స్ ఏర్పాటు చేసి అమ్మేందుకు సిద్ధం చేశారు. లక్నాపూర్ ప్రాజెక్టు నుంచి వెళ్లే సాగునీటి కాలువను కూడా మూసివేసి పైపులు వేసి రోడ్డు వేశారు. సంబంధిత ఇల్లీగల్ ఫామ్ ల్యాండ్‌పై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా.. సంబంధిత ఫామ్ ల్యాండ్ నిర్వాహకులకు నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో మంగళవారం తహసీల్దార్ తమ సిబ్బందితో వచ్చి పైప్‌లైన్ తొలగించి, ఫామ్ ల్యాండ్స్‌కు ఏర్పాటు చేసిన హద్దు రాళ్లను జేసీబీతో తొలగించారు.