సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యావాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ ఇవ్వకపోవడంతో నిరసన బాట పట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమీషన్లను ప్రతి నెలా అందేవని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డీలర్లు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల కేంద్రం వాటా, సెప్టెంబర్ నెల రాష్ట్రం వాటా కమీషన్లను విడుదల చేయలేదని వాపోతున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అందించాల్సిన కమీషన్లతో పాటు కేంద్రం నుంచి వస్తున్న వాటాను కూడా అడ్డుకుని రేషన్ డీలర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపిస్తున్నారు.
రోజులు తరబడిగా రేషన్ డీలర్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాల్లో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోతున్నదని ఆవేదన చెందుతున్నారు. నెలల తరబడిగా రేషన్ డీలర్లు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
ప్రభుత్వం స్పందించి ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ కమీషన్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే అక్టోబర్ రేషన్ పంపిణీ నిలిపేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,200 మందికి పైగా రేషన్ డీలర్లు ఉన్నారు. అందులో చాలా దుకాణాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఆరు నెలలుగా కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి రేషన్ దుకాణాలు నడుపుతున్నామని వాపోతున్నారు.
దసరా, దీపావళి పండుగలకు పస్తుండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమకు రావాల్సిన మొత్తం కమీషన్ విడుదల చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్లను కలిసి వేడుకున్నారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అక్టోబర్ కోటా బియ్యం పంపిణీ చేయబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదలయ్యేదాకా దుకాణాలను తెరవబోమని స్పష్టం చేశారు.