Ratan Tata | ముంబై, అక్టోబర్ 10: పారిశ్రామిక దిగ్గజం, దాతృశీలి రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. వొర్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శణార్థం ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న ఎన్సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై రతన్ టాటాకు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనల అనంతరం శ్మశానవాటికకు ఆయన పార్థివదేహాన్ని తరలించారు. రతన్ టాటా అంత్యక్రియల్లో కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూశ్ గోయల్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, టాటా కుటుంబసభ్యులు, టాటా గ్రూప్ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
రతన్ టాటా పార్శీ మతస్థుడు. సాధారణంగా పార్శీ మతానికి చెందిన వారు మృతదేహాలను ఖననం, దహనం చేయరు. నీరు, గాలి, భూమిని పార్శీలు పవిత్రంగా చూస్తారు. మృతదేహాలను ఖననం, దహనం చేయడం ద్వారా ఇవి కలుషితం అవుతాయని భావిస్తారు. అందుకే, రాబందులు, డేగలు వంటి పక్షులు తినేందుకు వీలుగా మృతదేహాన్ని దఖ్మా అని పిలిచే ప్రదేశంలో వదిలిపెడతారు. మరణించినా పక్షులకు ఆహారంగా మారాలనే ఆలోచనతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అయితే పర్యావరణ మార్పులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో విద్యుత్ దహన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. టాటా అంత్యక్రియలు కూడా ఎలక్ట్రిక్ విధానంలోనే పూర్తయ్యాయి.
రతన్ టాటాకు చివరి దశలో అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన శంతను నాయుడు అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ‘మీ స్నేహం ఇప్పుడు నాకు మిగిల్చిన వెలితిని జీవితాంతం పూడ్చడానికి ప్రయత్నిస్తాను. గుడ్ బై, మై డియర్ లైట్‌హౌజ్’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శంతను ప్రస్తుతం రతన్ టాటా కార్యాలయంలో పని చేస్తున్నారు.
రతన్ టాటా అవివాహితుడు. అయితే తాను నాలుగుసార్లు వివాహానికి చేరువై వెనక్కు వెళ్లినట్టు 2011లో సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రతిసారీ ఏదో కారణం చేత వివాహ ఆలోచన నుంచి వెనక్కి తగ్గినట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రజలతో మమేకమై ఉన్న తాను వెనక్కి చూసుకుంటే తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని అర్థమైందన్నారు. తాను వివాహం చేసుకుని ఉంటే జీవితంలో సంక్లిష్టతలను ఎదుర్కొని ఉండేవాడినేమోనని టాటా వ్యాఖ్యానించారు. కాగా, తాను అమెరికాలో ఉన్నప్పుడు ఒక యువతితో గాఢమైన ప్రేమలో పడ్డానని రతన్ టాటా చెప్పారు. అప్పట్లో తాను భారత్‌కు తిరిగి రాగా, ఆమె 1962 నాటి చైనా-భారత్ యుద్ధం కారణంగా రాలేకపోయిందని తెలిపారు.
రతన్ టాటా హృదయంలో జంతువులకు, ముఖ్యంగా శునకాలకు ప్రత్యేక స్థానం ఉండేది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వీధి కుక్కలను రక్షించేందుకు శంతను నాయుడు, అతడి స్నేహితుడు వాటికి రిఫ్లెక్టివ్ కాలర్లను అమర్చడానికి మొటోపాస్ అనే ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ గురించి శంతను రతన్ టాటాకు లేఖ రాయగా.. ఆయన ఈ ప్రాజెక్ట్ 11 నగరాల్లో అమలయ్యేలా సహాయం చేశారు. రతన్ టాటా దాతృత్వ సేవలకు గుర్తింపుగా 2018లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని స్వీకరించాల్సిందిగా ఇంగ్లండ్ రాజకుటుంబం ఆహ్వానించింది. అయితే తన పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్‌లోనూ కుక్కలను సంరక్షించేవారు. 2023లో తన పెంపుడు కుక్కను శస్త్ర చికిత్స కోసం ఆయన విదేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్‌లో అత్యాధునిక పశు వైద్యశాల అవసరమని భావించి అందుకోసం రూ.165 కోట్ల విరాళమిచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కొనియాడారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక, ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త అని శ్లాఘించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై, నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో అమలు చేసిన దార్శనిక కార్యాచరణ పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ స్మరించుకున్నారు. రతన్ టాటా మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దూరదృష్టి, నాయకత్వం, దాతృత్వంతో ఆయన చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాల్లో స్ఫూర్తి నింపారని అన్నారు.
రతన్ టాటా పార్థివదేహాన్ని ఆయన పెంపుడు కుక్క ‘గోవా’ వదలిపెట్టలేకపోయింది. ఆయన దేహం వద్దనే అది బాధతో తిరుగుతూ ఉండటం అక్కడున్న వారిని కలిచివేసింది. పదేండ్ల క్రితం గోవా నుంచి ఈ వీధికుక్కను ఆయన తనతో తెచ్చుకొని పెంచుతున్నారు. ఈ కుక్క అంటే టాటాకు చాలా ఇష్టమని దాని సంరక్షకుడు తెలిపారు.