నార్నూర్ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా రాపిడ్ ఫీవర్ సర్వేను ( Rapid fever survey) పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ డీఎంహెచ్వో కుడ్మెత మనోహర్( Manohar ) వైద్య సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ధాబా కె గ్రామంలో ఝరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో రాపిడ్ ఫీవర్ సర్వే శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవల తీరును పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవను అందించేలా కృషి చేయాలన్నారు, గ్రామాలలో అపరిశుభ్రత లోపించకుండా ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
రాపిడ్ ఫీవర్ సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వందశాతం ప్రసవాలు జరిగేలా చూడాలని గుర్తించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యాధికారి సంజీవ్, ఎంవో నాందేవ్, హెచ్ఈవో ఆడే సంజయ్, హెచ్ ఎస్ శ్రీదేవి, వైద్య సిబ్బంది సురేఖ, రత్న, కల్పన, ప్రకాష్, మోహన్ తదితరులు ఉన్నారు.