Arctic Ocean | న్యూయార్క్, మార్చి 12 : ఆర్కిటిక్ మహాసముద్రం ఎకోసిస్టమ్‌లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ ప్రాంతంలో 20 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆర్కిటిక్ మంచు కనిష్ఠ స్థాయిలో నమోదైంది. ఇలా వరుసగా మూడోసారి జరగడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రపంచ వాతావరణంలో, ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడంలో ఆర్కిటిక్ కీలకపాత్ర పోషిస్తున్నది. దీన్ని భూగ్రహ ఎయిర్ కండిషనర్‌గా శాస్త్రవేత్తలు పిలుస్తుంటారు. భూతాపం పెరుగుదలకు ఆర్కిటిక్‌లో మంచు కరగడం ముందస్తు ప్రమాద సూచికగా భావించవచ్చు. సాధారణంగా ఈ సమయానికి ఆర్కిటిక్‌లో మంచు గరిష్ఠ స్థాయిలో నమోదవ్వాలి. కానీ, అందుకు విరుద్ధంగా ఇప్పుడు కనిష్ఠ స్థాయి నమోదవుతున్నాయి. ఆర్కిటిక్‌లో సెప్టెంబర్ చివరికి వేసవి ముగుస్తుంది. ఆ సమయంలో మంచు కరగడం సాధారణం. కానీ, ఇప్పుడు వేసవి ముగిసినా మంచు ఎక్కువగా కరిగి కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నది. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి మంచు రహితంగా ఆర్కిటిక్‌ను చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.