హైదరాబాద్, ఏప్రిల్ 2, (నమస్తే తెలంగాణ): ఆర్థికాభివృద్ధికి సూచికలుగా గణించే స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం విడుదలచేసిన 2021 గణాంకాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో ద్వితీయ స్థానంలో హైదరాబాద్, తృతీయ స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, 4వ స్థానంలో సంగారెడ్డి, 5వ స్థానంలో నల్లగొండ జిల్లా నిలిచాయి. రంగారెడ్డి జిల్లా జీడీడీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.1,84,326 కోట్లు, స్థిర ధరల వద్ద రూ.1,27,760 కోట్లుగా నమోదైంది. జీడీడీపీలో ములుగు జిల్లా చివరి స్థానంలో ఉన్నది. ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలు చివరి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశం/రాష్ట్రం/జిల్లాలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల ఉత్పత్తిగా పరిగణిస్తారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి (8.9%) కంటే తెలంగాణ రాష్ట్రం (జీఎస్డీపీ) ఎక్కువ వృద్ధి (11.2%) నమోదు చేసినట్టు కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ ఇటీవల వెల్లడించింది.