దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు యూనిట్లను ఈ నెలాఖరులోపు కొంత మంది లబ్ధిదారులకు అందజేసేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేస్తున్నారు. యూనిట్ల గ్రౌండింగ్కు ఏర్పాట్లు చేస్తుండగా, ఈ నెల 31వ తేదీన వికారాబాద్లో మంత్రి సబితారెడ్డి లబ్ధిదారులకు యూనిట్లను అందజేయనున్నారు. ముందుగా లైసెన్స్లు ఉన్నవారికి కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాలను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా పౌల్ట్రీల ఏర్పాటు, పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి మొదటగా షెడ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.1.50లక్షల చొప్పున చెక్కులనూ పంపిణీ చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలో 358 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, ఇప్పటి వరకు జిల్లాకు రూ.రూ.17కోట్లు విడుదలయ్యాయి. త్వరలో యూనిట్లు తమ చేతికి అందనుండడంతో దళితబంధు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పరిగి, మార్చి 28: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు కొంతమంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టారు. లబ్ధిదారులకు ఒకేసారి రూ.10 లక్షల చొప్పున అందజేసి వారి జీవితా ల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. కాగా వికారాబాద్ జిల్లాలో 358 మంది లబ్దిదారులను ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపిక చేసి ఇన్చార్జి మంత్రి ఆమోదాన్ని కూడా పొందారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి 100 మం ది, తాండూరు నియోజకవర్గం నుంచి 100 మంది, పరిగి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి 80 మంది, కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి 60 మంది, చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలో 18 మందిని మొదటి విడుత లబ్ధిదారులుగా ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపిక చేయగా..వారిలో కొంతమందికి ఈ నెలాఖరులోపు యూనిట్లను అం దించేం దుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మ రం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి డీఆర్డీవో, పరిగి నియోజకవర్గానికి జడ్పీ సీఈవో, వికారాబాద్ నియోజకవర్గానికి జిల్లా వ్యవసాయాధికారి, తాండూరు నియోజకవర్గానికి జిల్లా పంచాయతీ రాజ్ అధికారులను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించగా జిల్లా మొ త్తం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దళితబంధు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాకు విడుదలైన నిధులు రూ.17కోట్లు
దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు అందించేందుకు ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు రూ.17 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలయ్యా యి. జిల్లాలోని మొత్తం 358 మంది లబ్ధిదారు లకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున దళితబంధు కింద గ్రాంటుగా అందజేస్తారు. ఈ లెక్కన మొత్తం రూ. 35.80 కోట్లు అవసరం కా గా ఇప్పటికే రూ.17కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన మరిన్ని నిధులు కూడా ప్రభుత్వం నుంచి విడుదల కానున్నట్లు సమాచారం.
షెడ్ల నిర్మాణానికి రూ.1.50 లక్షల చొప్పున
ఈ పథకం కింద పౌల్ట్రీఫారాల ఏర్పాటు, పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించి 68 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా అధికారులు ముందుగా వారికి షెడ్ల నిర్మాణం కోసం రూ.1.50 లక్షల చొప్పున చెక్కులను అందించనున్నారు. ఈ డబ్బుతో లబ్ధిదారులు తాము ఎంచుకున్న స్థలాల్లో షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాడి పశువులను రెండు విడుతల్లో వారికి ఇతర రాష్ర్టాల నుంచి తెప్పించి ఇస్తారు. అలాగే గొర్రె లు, మేకలను సైతం రాష్ట్ర స్థాయిలోని కమిటీ వారు ఎంపిక చేసిన ప్రాంతం నుంచి లబ్ధిదారులను తీసుకెళ్లి ఇప్పిస్తారు. ఇతర యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలోనే యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ముందుగా వాహనాలు అందజేత..
ఈ పథకం కింద లబ్ధిదారులకు ముందుగా వాహనాలను అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల కోసం దళితబంధు కింద మొత్తం 63 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారందరి పేర్లతో బ్యాంకు ఖాతాల ఓపెన్తోపాటు సంబంధిత వ్యాపారంపై వారికి పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పించడం కూడా పూర్తయింది. లబ్ధిదారులు కోరుకున్నట్లుగా వాహనాలను సమకూర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 63 మందిలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికే మొదట వాహనాలను అందించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు.. వాహనం నడిపించడం నేర్చుకొని లైసెన్స్ పొందిన తర్వాతే వాహనాలను అందించనున్నారు.
లబ్ధిదారులకు యూనిట్లను
పంపిణీ చేయనున్న మంత్రి సబితారెడ్డి
వికారాబాద్ జిల్లా పరిధిలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 31వ తేదీన వికారాబాద్లో జరుగనున్న ఓ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతులమీదుగా యూనిట్లను అందించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ముందుగా లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.