రంగారెడ్డి, మార్చి 28, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు. ఆదివారం లండన్‌లో తెలంగాణ జాగృతి ఎన్ఆర్ఐ-యూకే బృందం ఆధ్వర్యంలో జరిగిన మీట్ గ్రీట్ విత్ చేవెళ్ల ఎంపీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ బడుల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఏడేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన తన అనుభవాలను ఎన్ఆర్ఐలతో ఆయన పంచుకున్నారు.
అంతేకాకుండా జీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, యువతకు అందిస్తున్న ఉపాధి అవకాశాలు, చేస్తున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు. స్పందించిన పలువురు ఎన్ఆర్ఐలు తమవంతు సహకారాన్ని అందించడమే కాకుండా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూకే బృందం ప్రతినిధులు సుమన్‌రావు, రఘు జక్కుల, వంశీకిశోర్, మానస టేకుమంట్ల, బాల్గోని వెంకట్, వంశీతులసి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.