మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు
ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 27: వేసవికాలం మొదలవ్వడంతోనే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి రెండో వారానికే నిప్పులు చిమ్ముతున్న భానుడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కనిష్ఠ స్థాయిలోనే నమోదైన ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మార్చి నెల ప్రారంభం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పెరిగిన ఎండ తీవ్రతతో ప్రజలంతా ఉపశమన చర్యలపై దృష్టి సారించారు. ఉదయం తొమ్మిది గంటలు దాటిందంటే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. సాయంత్రం సమయంలో తమ తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున తప్పనిసరిగా ఇండ్ల నుంచి బయటికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గొడుగులు, టోపీలు, స్కార్ప్లను తలపై ధరించాలని పేర్కొంటున్నారు. మార్చి నెలలోనే ఈ విధంగా ఉం టే రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకో వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు కొబ్బరిబొండం, నిమ్మరసం, చెరుకురసం, పండ్లు తీసుకోవడంతోపాటు వోఆర్ఎస్ను వాటర్లో కలుపుకొని తాగితే మంచిదని ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి తెలిపారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ వాడకం కూడా క్రమంగా పెరుగుతున్నది. ఎండవేడిమి పెరుగుతున్నా కొద్దీ గృహ అవసరాలకు కరెంట్ వినియో గం అమాంతం అధికమవుతున్నది. ఫ్యాన్లు, ఫ్రిజ్లు, ఏసీలు ఇలా రకరకాలుగా వేడిమి నుంచి ఉపశమనానికి ప్రజలంతా సిద్ధం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది.
ఎండలో కండ్లు జరభద్రం..
ఎండలో ఎక్కువగా తిరిగితే కండ్లకు అలసట వస్తుంది. కండ్ల చుట్టూ నల్లచారలు ఏర్పడుతాయి. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణకు కండ్లజోళ్లను ధరించాలి. తరచూ చల్లని నీటితో కండ్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వేడి గాలికి కూడా కండ్ల జోళ్లు రక్షణగా పనిచేస్తాయి.
కేశాల రక్షణకు..
సూర్యకిరణాలు జుట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటివల్ల జుట్టు పేలవంగా తయారయ్యే ప్రమాదముంది. బయటికి వెళ్లేటప్పుడు స్కార్ప్ కట్టుకోవాలి. చల్లటి నీటితో సాన్నం చేయాలి. వేసవిలో జుట్టుకు రోజుకు రెండుసార్లు నూనె రాయాలి. ఎండకు చెమట అధిక వచ్చే అవకాశముందున్నందున వెంట్రుకలను కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు పాటించాలి.
మధ్యాహ్నం సమయంలో..
పిల్లలు ఎండను తట్టుకోలేరు. వేసవిలో తల్లిదండ్రులే వారికి గొడుగులా రక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. సమయంలో ఆడుకునేందుకు అనుమతించొద్దు క్రీడలు ఆడేందుకు సాయంత్రం సమయాల్లో పంపించాలి ఫుడ్ తినకుండా చర్యలు తీసుకోవాలి ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, అంబలి తాగిస్తూ ఉండాలి.
చర్మాన్ని కాపాడుకోవాలి
ఎండాకాలంలో చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అందువల్ల నిర్లక్ష్యం చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీని తీసుకెళ్లాలి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలను సాయంత్రానికి వాయి దా వేసుకోవాలి. ఆభరణాలు ధరించే వారికి మెడచుట్టూ చెమట కారణంగా అలర్జీ వచ్చే అవకాశం ఉన్నందున.. ఎండాకాలంలో ఆభరణాలను ధరించకపోవడమే మంచిది. శరీరాన్ని పరిశుభ్రంగా ఉం చుకోవాలి. ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయా లి. ఉతికిన బట్టలనే ధరించాలి. కాచి, వడబోసిన నీటిని తాగాలి. వేసవిలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
వేసవిలో ఆహారం..
పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. మద్యం, కాఫీ, టీ, ధూమపానానికి దూరంగా ఉండాలి. మసాలాలు తగ్గించాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. చికెన్, మటన్ వంటి వాటిని వేసవిలో తినకపోవడమే మంచిది.
తరచూ నీటిని తీసుకోవాలి
ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు తరచూ నీటిని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగొద్దు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీలను ధరించాలి. ఎండలో బయటకెళ్తే కొబ్బరిబొండం, పండ్లు, వోఆర్ఎస్ ప్యాకెట్లను నీటిలో కలిపి తీసుకోవాలి.
-నాగజ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్వో ఇబ్రహీంపట్నం