సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): మీరు పోటీ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే మంచిదే. మరి ఎక్కడ ఉంటున్నారు.. ఎలా సిద్ధమవుతున్నారనేది కూడా ముఖ్యమే. పోటీ పరీక్షలు అనగానే నగరంలోని అశోక్‌నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్, నల్లకుంట లాంటి కొన్ని ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతాలు సివిల్స్, గ్రూప్-1, 2, 3, 4కు సన్నద్ధమయ్యే వారికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. ఆయా ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే సెంటర్లు డజన్లకొద్దీ ఉండటం తో ఇక్కడ ఎటుచూసినా పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్న ఉద్యోగార్థులు కనిపిస్తుంటారు. అం దువల్ల నిరుద్యోగ యువతీయువకులు ఇక్కడే ఉండేందుకు ఇష్టపడుతుంటారు. దీంతోపాటు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ కూడా అతి సమీపంలోనే ఉండటం, స్టడీ మెటీరియల్, జిరా క్స్ సెంటర్లు, పలు పబ్లికేషన్ల పుస్తకాలు లభిస్తుండటం కూడా మరో కారణంగా చెప్పొచ్చు.
అదేవిధంగా అమీర్‌పేటలో హాస్టళ్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ఐటీ, ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు అక్కడ ఉండేందుకు అనువుగా ఉం టుందని కర్నాకర్రావు అనే ఉద్యోగి తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పోలీ స్ విభాగం, బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులు ఎక్కువగా ఉంటారని ఎస్ఐ పరీక్షకు సన్నద్ధమవుతున్న శశాంక్మోహన్ అనే యువకుడు తెలిపాడు.
టెట్ నోటిఫికేషన్ రావడంతో..
టెట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇక త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా రానున్న నేపథ్యం లో ఉద్యోగార్థులు వసతి గృహాల వేటలో నిమగ్నమయ్యారు. అంతేకాదు అన్ని వసతులుంటే వెంటనే వసతి గృహాల్లో చేరిపోతున్నారు. వసతులను బట్టి నెలకు రూ.4 నుంచి రూ. 8వేల వరకు ఫీజు చెల్లిస్తున్నట్లు అభ్యర్థులు, ప్రైవేట్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అదేవిధంగా అశోక్‌నగర్, గాం ధీనగర్, చిక్కడపల్లిలోని వసతిగృహాల్లో ఒక్కో వ్యక్తి నెల ఫీజుగా రూ.4వేల నుంచి 4500 వరకు చెల్లిస్తున్నారని సురేశ్ అనే అభ్యర్థి తెలిపాడు. ఆ వసతిగృహాల్లో సాధారణ వాష్రూములతోపాటు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అం దిస్తున్నట్లు, ఒక రూమును నలుగురు కలిసి షేర్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
అదేవిధంగా ప్రత్యేక రూములైతే నెలకు రూ. 7వేల నుంచి రూ. 7500 వరకు హాస్టల్ నిర్వాహకులు ఫీజును వసూలు చేస్తున్నారు. ఏసీ రూములైతే ఒక గదిలో ముగ్గురు ఉంటే ఒక్కొక్కరికి రూ.7000 చార్జీ ఉంటుందని, ప్రత్యేక ఏసీ గది కావాలంటే రూ.8500 నుంచి రూ.10వేల వరకు ఫీజు ఉంటుందని అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్ వార్డెన్ తెలిపాడు. నగరంలోని అన్ని వసతి గృహాల్లో ఈ విధానాన్నే నిర్వాహకులు అమ లు చేస్తున్నట్లు తెలిపాడు. అవసరమైన వస్తువు లు తప్ప అభ్యర్థులు ఎక్కువగా లగేజీని కూడా తీసుకురావద్దనే నిబంధన ఉందన్నారు.
అన్ని వసతులుంటేనే చదువగలం
వసతిగృహాల్లో అన్ని వసతులుంటేనే మంచిగా చదివేందుకు వీలుగా ఉంటుంది. చుట్టూ వాతావరణం కూడా బాగుంటే నే చదివింది గుర్తుంచుకుం టాం. హాస్టల్ నుంచి కోచింగ్ సెంటర్‌కు అక్కడి నుంచి గ్రంథాలయానికి దగ్గరలో ఉన్న వసతిగృహాల్లో చేరితే సమయం ఆదా అవుతుంది. చదువుకునేందుకు సమయం ఉంటుంది.
– చంద్రశేఖర్, గ్రూప్-1 అభ్యర్థి