పరిగి, మార్చి 26: వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది పండ్ల రసాలు తయారు చేసే పలు కంపెనీల నిర్వాహకులతో ఎఫ్పీవో (ఆహార ఉత్పత్తి సంఘాలు)లు మామిడికాయలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. కాగా ఈసారి ఏకంగా విదేశాలకు మామిడిపండ్లను ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మరింత లాభం వస్తుందని ఉద్యానవన శాఖ అధికారుల ఆలోచన. అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలను వారు తీసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 12వేల పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఎకరాకు కనీసం మూడు టన్నుల వరకు మామిడికాయలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. కొంత పంట నష్టపోవడం, దిగుబడి తగ్గినా జిల్లా పరిధిలో ఈ ఏడాది సుమారు 20 వేల టన్నులకు పైగానే మామిడికాయల పంట వస్తుందని భావిస్తున్నా రు. ఇందులో కొంత గతేడాదిలాగే పండ్లరసాల తయారీ కంపెనీలకు కేటాయించి.. మిగిలిన మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ముంబై నుంచి విదేశాలకు..
సాధారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక ఉత్పత్తులు, పండ్లు ముంబై నుంచి విదేశాలకు ఎగుమతి జరుగుతుంది. సముద్ర మార్గంతోపాటు కార్గో విమానాల ద్వారా అక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. యూఏఈ, యురోపియన్ దేశాలు, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ వంటి దేశాలు మన దేశం నుంచి అధికంగా మామిడిపండ్లను దిగుమతి చేసుకుంటాయి. మామిడిపండ్ల ఎగుమతికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో ఆన్లైన్ ద్వారా ఇప్పటికే జిల్లాకు చెందిన 120 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని ఉద్యానవన శాఖ అధికారులు స్వయంగా పరిశీలించి, పండ్ల తోటలను సందర్శించి ఎగుమతి చేసేందుకు మామిడికాయలు పనికొస్తాయని నిర్ధారించిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన అనుమతులొస్తాయి. ఇదిలావుండగా మామిడిపండ్లను ఢిల్లీకి కూడా ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ చుట్టుపక్కల మామిడి తోటలు ఉన్నప్పటికీ తెలంగాణతో పోలిస్తే సుమారు రెండు నెలలు ఆలస్యంగా అక్కడ మామిడి పండ్లు వస్తాయని, అందువల్ల ఢిల్లీకి ఎగుమతి చేయడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
మామిడిపండ్ల ఎగుమతికి చర్యలు
జిల్లాలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా. జిల్లాలోని నేలలు
పండ్లతోటల పెంపకానికి అనుకూలమైనవి. ముంబై ప్రాంతంలోని ఎగుమతిదారులు జిల్లాకు వచ్చి మామిడి తోటలను పరిశీలిస్తున్నారు. మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇప్పటికే జిల్లా నుంచి 120మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సీజన్ కంటే ముందే రైతులు, ఎగుమతిదారులతో ప్రత్యేకంగా సదస్సును నిర్వహిస్తాం. మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తే రైతులకు మరింత మంచి ధర లభిస్తుంది.
-చక్రపాణి, వికారాబాద్ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి
జిల్లాలో అనువైన నేలలు
జిల్లాలోని నేలలు మామిడితోటల సాగుకు అనుకూలమని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పరిగి, కులకచర్ల, వికారాబాద్, పూడూరు, కొడంగల్ తదితర ప్రాంతాల్లోని నేలల్లో పండ్ల తోటల సాగు బాగుంటుందన్నారు. ఇక్కడ సాగు చేసిన మామిడి తోటల్లో మంచి దిగుబడి వస్తున్నా కొన్ని యాజమాన్య పద్ధ్దతులను పాటించడం ద్వారా ఉత్పత్తిని మరింత పెంచొచ్చని వారు సూచిస్తు న్నారు. జిల్లాలో సాగు చేస్తున్న మామిడి తోటలను ముంబైకి చెందిన ఒక కంపెనీ ప్రతినిధుల బృందం వచ్చి పరిశీలించిందని, త్వరలోనే మరో బృందం రానున్న ట్లు అధికారులు తెలిపారు. నాణ్యత గల పండ్లను వారు ముంబై నుంచి విదేశాలను ఎగుమతి చేస్తారన్నారు. పండ్లతోటల వద్దే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి మామిడికాయలు తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. మామిడిపండ్లు మార్కెట్లోకి వచ్చే పదిహేను రోజుల ముందు ముంబైకి చెందిన ఎగుమతిదారులు, అధికారులు, మామిడి రైతులతో వికారాబాద్లో ప్రత్యేకంగా సదస్సును ఏర్పాటు చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ రెండోవారంలో ఈ సదస్సును నిర్వహించే అవకాశం ఉన్నది. మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మరింత మంచి ధర లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.