యాచారం, మార్చి 20 : వేసవిలో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఫారెస్టు అధికారులు శ్రీకారం చుట్టారు. మండలంలోని తాడిపర్తి ఫారెస్టులో సాసర్ ఫిట్లు నిర్మించారు. ఇందులో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. నింపిన నీటిని నిత్యం తాగుతూ పక్షులు, జంతువులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు అటవీ ప్రాంతాల్లో జీవించే మూగ జీవాలు నీటి కోసం అల్లాడుతాయి.
ఎక్కడ చెరువులు, కుంటలు, బావులున్నాయో అక్కడికి వలస వెళ్తాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మూగజీవాలకు తాగునీటి సమస్య తలెత్తుతుంది. దీంతో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులను సంరక్షించడానికి పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. అటవీ జంతువులు సంచరించే స్థలాలు, నివసించే ప్రాంతాల్లో నీటి నిల్వ గుంతలను నిర్మిస్తున్నారు. 40సెంటీ మీటర్ల లోతు, 4 మీటర్ల వెడల్పుతో నీటిగుంతను తీసి నీళ్లు ఇంకిపోకుండా సిమెంట్ చేశారు. వన్య ప్రాణులకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా, అందులోకి దిగినా ఆపద తలెత్తకుండా సాసర్ మాదిరిగా నీటి గుంతను ఏర్పాటు చేశారు.
పాతవాటికి సైతం మరమ్మతులు చేసి నీటితో నింపుతున్నారు. మొత్తం 38 సాసర్ ఫిట్లను అధికారులు నిర్మించారు. తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ట్యాంకర్ ద్వారా నీళ్లు నింపుకొని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి గుంతలను నింపుతున్నారు. తాడిపర్తి, కుర్మిద్ద అటవీ ప్రాంతంలో తాటికుంట, చిన్నతాటి కుంట, వెంకటాయకుంట, పందికుంట, గండికుంటల్లో ప్రస్తుతం నీళ్లున్నప్పటికీ అదనంగా 10సాసర్ఫిట్లను నిర్మించారు. అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీటిలో నీళ్లు అయిపోగానే వెంటనే వాటిని శుభ్రం చేసి మళ్లీ నీటితో నింపుతున్నారు. వారానికి 20 ట్యాంకర్ల నీటిని వన్యప్రాణుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో వన్య ప్రాణులు వేసవిలో నీటికోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ దాహాన్ని తీర్చుకుంటున్నాయి.
మండలంలో తాడిపర్తి, నానక్‌నగర్, కుర్మిద్ద, గున్గల్, గడ్డమల్లాయగూడ, నల్లవెల్లి, కొత్తపల్లి, మేడిపల్లి, మంథన్‌గౌరెల్లి తదితర గ్రామాల శివారులో వేల ఎకరాల్లో ఫారెస్టు ఉంది. ముఖ్యంగా తాడిపర్తి క్లస్టర్ తాడిపర్తి, కుర్మిద్ద, కడ్తాల్, ఎక్వాయపల్లి గ్రామాల్లో 16,220 హెక్టార్లలో అటవీ భూములున్నాయి. అక్కడ జింకలు, దుప్పులు, కోతులు, తోడేళ్లు, నక్కలు, కొండముచ్చులు, ఆల్గా, ఏదువు, అడవి పందులు, చిరుత పులి, నెమళ్లు, వివిధ రకాల పక్షులు, క్షీరదాలు అనేక జీవరాశులు సాసర్ ఫిట్‌లో నిల్వ ఉంచిన నీళ్లను తాగి తమ దాహార్తిని తీర్చుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతంలో మూడేండ్లుగా చిరుతపులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆవులు, దూడలు, కుక్కలను పొట్టన పెట్టుకున్నాయి. ఇవి జనావాసాలకు రాకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అక్కడి జింకలు తమ దాహార్తిని తీర్చుకునేలా నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేసి తరచూ ట్యాంకర్లతో నీటిని నింపుతున్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు కృషి
అటవీ ప్రాంతంలో నివసించే వన్యప్రాణుల సంరక్షణే అటవీశాఖ ప్రధాన ధ్యేయం. వేసవిలో జంతువులు, పక్షులు, క్షీరదాల నీటి అవసరాలను తీర్చేందుకు అటవీ ప్రాంతాల్లో సాసర్ ఫిట్లను నిర్మించాం. తరచూ ట్యాంకర్లతో నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నాం. వేసవిలో వన్య ప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.
– నిఖిల్‌రెడ్డి, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్