మంచాల, అక్టోబర్ 30 : పట్టుదలతో చదువుతున్న ఆ ఊరి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఒకరికి ఉద్యోగం వస్తే మాకెందుకు రాదన్న తపనతో చదివి ఒక్కొక్కరూ ఉద్యోగాలను సాధించి ఆ గ్రామ దశదిశను మార్చేశారు మంచాల మండలం ఆరుట్ల గ్రామ యువకులు. గ్రామంలో ఏ వీధి చూసినా పెద్ద పెద్ద ఇండ్లు కనిపిస్తాయి. ఆ ఊరిలో 280 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదువుకుని కొలువులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు గ్రామంలో 20 మందే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు. ఇప్పుడు పల్లెంతా కొలువుదారులే. పుట్టిన ఊరుకు సేవ చేయాలన్న మంచి మనస్సుతో గ్రామాభివృద్ధికి సహాయ, సహకారాలను అందిస్తున్నారు.
ఆదర్శంగా ఆరుట్ల గ్రామం..
గ్రామంలోని ఏ వీధి చూసినా సిమెంటు రోడ్లు దర్శనమిస్తాయి. వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. గ్రామంలోని ఆదర్శ పాఠశాలతో పాటు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో స్కూళ్లను ఏర్పాటు చేసి, విరివిగా మొక్కలు నాటడంతో ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం సంతరించుకున్నది. గ్రామంలో పురాతన వేణుగోపాల స్వామి, శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, రామాలయంతో పాటు రెండు మసీదులు, రెండు చర్చీలు ఉన్నాయి. గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి.
280 మంది ప్రభుత్వ ఉద్యోగులు..
ఆరుట్ల గ్రామంలో 136 మంది ఉపాధ్యాయులు, 78 మంది ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు, 42 మంది పోలీసు ఉద్యోగులు, 8 మంది ఇంజినీర్లు, 8 మంది వైద్యాధికారులు, 40 మంది వరకు ప్రైవేటు ఉద్యోగాల్లో పని చేస్తున్నారు. సుమారు పది మంది వరకు కాంట్రాక్టర్లు ఉన్నారు. మండల స్థాయి రాజకీయ పార్టీల్లో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా..
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నా. ఆపైచదువులకు స్థోమత లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నా. గ్రామ విద్యార్థులకు ట్యూషన్ చెప్పి ఇంటర్, పైచదువులు చదువుకున్నా. ఉద్యోగం సాధించాలన్న పట్టుదలే ఉపాధ్యాయుడిని చేసింది.
కష్టపడి చదివాను..
ఉపాధ్యాయుడి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివాను. పాఠశాలలో తోటి విద్యార్థులతో పోటీపడి చదివి మంచి మార్కులు సాధించేవాడిని. నేడు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందుకు ఆనందంగా ఉన్నది.
ఉపాధ్యాయ వృత్తి చాలా సంతృప్తినిస్తున్నది..
ఉపాధ్యాయ వృత్తితో ఎంతో మందిని తీర్చిదిద్దే అవకాశం దక్కింది. ఉత్తమ బోధన అందిస్తూ ఆనందంగా గడుపుతున్నా. నలుగురికి ఉపయోగపడాలన్న తపనతో ఎంతో కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాన్ని సాధించి, ఉపాధ్యాయ ఉద్యోగం పొందాను.
గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు..
ఆరుట్ల గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పాటు గ్రామ ఉద్యోగుల ఫండ్‌తో గ్రామంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. పంచాయతీ పాలక వర్గానికి సలహాలు, సూచనలూ ఇస్తున్నారు.
ఆదర్శంగా నిలిచారు..
ఆరుట్ల ఉపాధ్యాయులకు పుట్టినిళ్లులా మారింది. ఏవీధి చూసినా ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తారు. ప్రతి ఉద్యోగి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఆరుట్ల గ్రామ ఉపాధ్యాయులు గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.