కులకచర్ల, అక్టోబర్ 29 : హరిత పాఠశాలలా కులకచర్ల బాలికల ఉన్నత పాఠశాల మనకు దర్శనం ఇస్తున్నది. ప్రభుత్వం పాఠశాలల్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించేందుకు పెద్దపీట వేస్తున్నది. ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రత్యేక కృషితో హరితబడులుగా మారుతున్నాయి. కులకచర్ల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులు మొక్కల పెంపకంలో మక్కువ చూపుతున్నారు. దీంతో పాటు పరిసరాల పరిశుభ్రతకూ ప్రాధాన్యతనిస్తున్నారు. నాటిన మొక్కలను రక్షించేందుకు ప్రతిరోజూ నీటిని అందిస్తున్నారు. దీంతో పాఠశాలలో మొక్కలు పెద్దవై చల్లని నీడనిస్తున్నాయి. విద్యార్థులకు వేసవిలో చెట్లనీడలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు, విద్యార్థులు ఆసక్తి కనబర్చడంతో పాఠశాల హరితవనంలా మారింది.
ఉపాధ్యాయుల ప్రోత్సాహం..
మొక్కల పెంపకంలో ఉపాధ్యాయులు ప్రోత్సాహం కనబరుస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ పాఠశాలలను హరితమయంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. పాఠశాలలో విరామం సమయంలో తరగతుల వారీగా విద్యార్థులు మొక్కల సంరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నారు.
ఆదర్శ పాఠశాల
పాఠశాల హరితవనంలా తయారు కావడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతీసుకోవడమే కాకుండా మొక్కలను పెంచేందుకు అనుకూలమైన గ్రౌండ్ ఉన్న కారణంగా పాఠశాలలను వనంలా చేసేందుకు దోహదపడింది. ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలను హరితబడులుగా మార్చేందుకు కృషిచేయాలని పలువురు పేర్కొంటున్నారు.
పాఠశాలను ఆహ్లాదకరంగా తయారు చేశాం..
కులకచర్ల బాలికల ఉన్నత పాఠశాల పచ్చని హరిత బడిలా తయారు చేశాం. పాఠశాలలో విరివిగా మొక్కల పెంపకాన్ని చేపట్టాం. వాటికి ప్రతి రోజు నీటిని అందించి హరితవనంలా తయారు చేశాం. విద్యారులు, ఉపాధ్యాయులకు వేసవి కాలంలో చెట్లకింద నిలబడటం వలన చల్లని గాలి వస్తుంది. పాఠశాలలో మొక్కలను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మొక్కలు ఏపుగా పెరిగి నీడనందిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో ఇదే విధంగా మొక్కల పెంపకాన్ని చేపడితే బాగుటుంది.