పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పోటీపడి పెంచుతున్నది. ఎన్నడూ లేని విధంగా రోజుకింత పెంచుతూ రికార్డు సృష్టిస్తున్నది. కేంద్రం వైఖరితో మార్కెట్లో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం ఉమ్మడి జిల్లాలో పెట్రోల్ లీటరు ధర రూ.113.22, డీజిల్ లీటరు ధర రూ.106.36 ఉన్నది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యికి చేరువలో ఉన్నది. దీని ప్రభావంతో రవాణా చార్జీలు పెరగడం.. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశన్నంటడంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. సిలిండర్ కొనుక్కోలేక పేదోడికి మళ్లీ కట్టెల పొయ్యి దిక్కయ్యే దుస్థితి నెలకొన్నది. వంట నూనెలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరల ధరలు రెట్టింపవడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా పేదోడి పరిస్థితి మారింది. రెక్కాడితేగాని డొక్కాడని పేదలు పచ్చడి మెతుకులతోనే పబ్బం గడుపుకుంటున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పేదలకు భారంగా మారింది. కూరగాయల రేట్లు, రవాణా చార్జీలు పెరగడంతో మాలాంటి సామాన్యులం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలి. అన్ని ధరలు పెరగడంతో నిత్యం కూలి పనులు చేసేవాళ్లు బతుకలేని పరిస్థితి.
-ఆనందం, పంచలింగాల్, మర్పల్లి మండలం
కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు తీరు వల్ల ఏమి కొనేటట్టులేదు.. ఏమి తినేటట్టులేదు.. అనే సినిమా పాట గుర్తుకొస్తున్నది.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడంతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువులపై తీవ్ర భారం పడింది. ఇంకేముంది.. టమటాను టచ్ చేసే పరిస్థితి లేదు.. వంకాయను కొందామంటే ఓరగా చూస్తున్నది.. ఆలుగడ్డను కొంటలేరని అలిగి చూస్తున్నది.. చిక్కుడు, బీర, బెండ, దొండ గుర్రుమంటున్నయ్.. మిర్చి, ఉల్లి ధరలు ఘాటెక్కి సామాన్యుడి నశాలానికెక్కుతున్నయ్.. ఉప్పు, పప్పు చిటపటలాడుతున్నయ్.. మంచి నూనె ధర సుర్రుమంటున్నది.. బియ్యం ధరలు మింగుడు పడడం లేదు.. పెరిగిన ధరలు ప్రజలపై ఇంతటి ప్రభావం చూపుతున్నా కేంద్ర సర్కారుకు కనిపించడం లేదు.. వాహనదారులైతే పెట్రోల్, డీజిల్ పోయించుకుందామంటే నెలంతా గడిచేదెట్లా అని లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెరిగిన ధరలతో సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు.
పరిగి/షాబాద్, అక్టోబర్ 27 : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా చార్జీలు పెరుగడంతో నిత్యావసర ధరలూ పెరిగి సామాన్యుడికి మోయలేని భారమై నడ్డి విరుస్తున్నాయి. గ్యాస్ ధరలైతే కొత్త రికార్డును సృష్టిస్తూ నరకం చూపిస్తున్నాయి. గతంలో ఆరు నెలలు, ఏడాదికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే గగ్గోలు పెట్టేవారు. ప్రస్తుతం రోజూ ధరలు పెరుగుతుండడంతో వాటి ప్రభావం వల్ల ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. నేడు మార్కెట్లో ఏదన్నా కొనాలంటే జడుసుకునే పరిస్థితి నెలకొన్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగడం కారణంగా ఉప్పు, పప్పు, కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న ధరలతో వాహనాలను నడిపే పరిస్థితుల్లో లేమని ప్రజలు వాపోతున్నారు. మార్కెట్లో ఏ కూరగాయ కొనాలన్నా అధిక ధరలు పలుకుతున్నాయి. కిలో కొనే చోట అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలతో జనం ఆందోళన చెందుతున్నారు.
భారీగా పెరిగిన ధరలు…
లీటర్ పెట్రోల్ ధర రూ.113కు చేరుకోగా, అదే స్థాయిలో డీజిల్ ధర లీటరు రూ.106కు చేరింది. ఇదివరకు రూ.వంద పెట్రోల్ పోసుకుంటే ఎంతో తిరిగేవాళ్లం.. ప్రస్తుతం రూ.200 పోసినా సరిపోవడం లేదని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. పెద్ద వాహనాల్లో డీజిల్ పోయలేక ఇబ్బందులు పడుతున్నారు. వంటగ్యాస్ రూ. 952 చెల్లిస్తేనే సిలిండర్ వస్తున్నది.
భగ్గుమంటున్న నిత్యావసరాలు…
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడం వల్ల నిత్యావసర ధరలపై ప్రభావం పడింది. ప్రధానంగా డీజిల్ ధరల పెంపుతో పరోక్షంగా పేదలపై భారం పడింది. సరుకుల రవాణా పూర్తిగా లారీలలో జరుగుతున్నది. తద్వారా డీజిల్ ధర పెంపుతో రవాణా ఖర్చు అధికమైంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసరాలైన ఉప్పు మొదలుకొని పప్పులు, ఇతర వస్తువుల ధరలు పెరిగాయి. కందిపప్పు కిలో రూ.110, శనగ పప్పు రూ.70, ఎర్రపప్పు రూ.95, పెసర పప్పు రూ.100, మినప పప్పు రూ.110కి లభిస్తున్నాయి. వంట నూనెలకు సంబంధించి సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150, పల్లినూనె లీటరు ధర రూ.150 ఉన్నది. నిత్యం వాడే సబ్బులు, ఇతర నూనెలు, సరుకులన్నింటి ధరలూ గత రెండేండ్లతో పోలిస్తే మోతమోగుతున్నాయి. కూరగాయల ధరలు టమాట కిలో రూ.40, బీరకాయ, బెండకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, ఇతర కూరగాయలు కిలో రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగాయి. సామాన్య జనం నిత్యావ సరాలను కొనాలంటేనే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం ధరలను కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే..
ధరల పెరుగుదలకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగ్యాస్ ధరలూ రూ.వెయ్యికి చేరువలో ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరుగడం వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతున్నది.
అందనంత ఎత్తున ..
మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరిగాయి. ఏ కూరగాయలు కొనాలన్నా కిలోకు రూ.40కి పైమాటే. కిలో కొనే బదులు అర కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. పప్పు, నూనె ధరలు కూడా భారీగా పెరిగాయి.
వ్యాపారం కుంటుపడింది..
పెరిగిన నిత్యావసర ధరల కారణంగా ప్రజలు అంతగా కొనుకొలు చేయడం లేదు. పప్పు, నూనె, పిండి, బియ్యం తదితర ధరలన్నీ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో గిరాకీ పడిపోయింది. కొద్దిపాటి సరుకులు కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు.
కొనలేం.. తినలేం..
కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరుగడంతో కొనలేం.. తినలేం అన్న చందంగా మారింది. కిలోకు బదులు పావుకిలో, అరకిలో కొంటున్నారు. పెరిగిన ధరలతో మాకూ గిట్టుబాటు కావడం లేదు. ధరలు అదుపుచేస్తేనే సామాన్యులకు మేలు చేకూరుతుంది.
వాహనం నడుపాలంటేనే భయం వేస్తున్నది..
రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడం చూస్తుంటే వాహనం నడుపాలంటేనే భయం వేస్తున్నది. గత సంవత్సరం కరోనాతో అల్లకల్లోలం కాగా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మోత మోగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలి.