షాబాద్/మొయినాబాద్, అక్టోబర్ 26: ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ ఈసీ వాగుకత్వ వద్ద సోమవారం ఈత కోసం వెళ్లి నీటమునిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యా యి. మొయినాబాద్ మండలంలోని సజ్జన్పల్లి గ్రామానికి చెందిన సన్వల్లి పవన్(18) గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు చెందిన విక్కి (22) తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం మొ యినాబాద్కు వచ్చి కనకమామిడి రెవెన్యూలో ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నారు. అలాగే వికారాబాద్ జిల్లా నాగసముందర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే విద్యార్థి కుటుంబం కూడా ఇక్కడికి వచ్చింది. వీరు ముగ్గురు స్నేహితులు. ఆంజనేయులు సోమవారం ఇంటర్ పరీక్ష రాసి సజ్జన్‌పల్లికి వచ్చాడు. సాయంత్రం సమయంలో వీరు ముగ్గురు కలిసి ఈత కొట్టేందుకు వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఈసీ వాగులో ఉన్న కత్వ వద్దకు వెళ్లారు. విక్కి, పవన్ ఇద్దరు చేతులు పట్టుకుని నీటిలోకి దూకారు. వారు దూకిన చోట గుంత లోతుగా ఉండటంతోపాటు నీటి ప్రవా హం కూడా ఉన్నది. దీంతో వారికి ఊపిరి ఆడక నీటిలో మునిగి గల్లంతయ్యారు. గమనించిన ఆంజనేయులు వెంటనే ఈ విషయాన్ని స్థానికులకు తెలిపాడు. వారు ఘటనాస్థలికి చేరుకుని గ్రామానికి చెందిన కొందరు గజ ఈతగాళ్లను నీటిలోకి దింపి వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితంలేదు. సోమవారం సాయంత్రం చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపేశారు. మంగళవారం ఉదయం పోలీసులు
ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపి మృ తదేహాలను బయటకు తీసి అక్కడే చేవెళ్ల ప్రభు త్వ దవాఖాన వైద్యులతో పోస్టుమార్టం చేయిం చారు. అనంతరం మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు తరలించారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే యాదయ్య పరామర్శ
ఈసీ వాగులో గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం ఘటనాస్థలిని సందర్శించి తీవ్ర విచారం తెలిపారు. ఎమ్మెల్యేతోపాటు మొయినాబాద్ జడ్పీటీసీ శ్రీకాంత్ మృ తుల కుటుంబాలకు రూ.15వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. అదే విధంగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా యువకుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పవన్ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు.