ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన వైఖరి తెలుపాలని డిమాండ్ చేస్తూ గురువారం నగరంలో రాష్ట్ర సర్కార్ చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. ఉమ్మడి జిల్లా అన్నదాతల పక్షాన జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు తరలివెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో ధర్నా ప్రాంగణం కిక్కిరిసింది. ప్రతి ఒక్కరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయగా ధర్నా చౌక్ దద్దరిల్లింది. అంతకుముందు పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఓవైపు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేదీలేదని చెబుతుంటే.. మరోవైపు బీజేపీ నేతలు వరి సాగు చేపట్టాలని సూచిస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, పంజాబ్‌లో ధాన్యం కొన్నప్పుడు మన ధాన్యం ఎందుకు కొనదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, నవంబర్ 18 : వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద గురువారం మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులపక్షాన పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారా, లేదనేది పేర్కొనాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనుగోలు చేయబోమని చెబుతుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు వరి సాగు చేపట్టాలని సూచిస్తుండడంతో రైతులను అయోమయానికి గురి చేయకుండా, వడ్లు కొంటారా, కొనరా స్పష్టం చేయాలన్నారు. రైతుల పక్షాన ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ మహాధర్నా నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ మహా ధర్నాలో మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితోపాటు చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, వాణీదేవి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వికారాబాద్ జిల్లా తరఫున జడ్పీ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, పి.నరేందర్‌రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ పాల్గొన్నారు. తాము సైతం సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ రైతులకు అండగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు.
కొనే వరకు కొట్లాడుడే..
రైతులపై వివక్ష తగదు : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్, నవంబర్ 18 : రైతుల ఉసురుపోసుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కువద్ద చేపటిన రైతు మహా ధర్నాలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. రైతులపై వివక్ష చూపడం తప్పా, కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదని, కార్పొరేట్ సంస్థలపై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకు ఉండదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, రైతులను రోడ్డున పడేస్తే ఎవ్వరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విద్వేషాలను రెచ్చగొట్టడం తప్పా, రైతుల ప్రయోజనాలను, ప్రజల బాధలను పట్టించుకోని మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వరి ధాన్యాన్ని కొంటరా ? కొనరా ? అనే విషయాన్ని చెప్పకుండా బాయిల్డ్ రైస్ కొనం అని పొంతన లేని మాటలను చెప్పుతూ, రైతులను మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం జరిగేవరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందిరా పార్కు వద్ద చేసిన ధర్నాతోనైనా కేంద్రంలో చలనం రావాలన్నారు.
టీఆర్ఎస్ శ్రేణులతో మహా ధర్నాకు ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, నవంబర్ 18 : సీఎం కేసీఆర్ రైతులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహా ధర్నాకు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వికారాబాద్ నుంచి బయల్దేరారు. కార్యక్రమంలో వికారాబాద్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
స్పష్టమైన ప్రకటన చేయాలి
ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ఆమనగల్లు, నవంబర్ 18 : వరిధాన్యం కొనుగోలు, యాసంగి వరి పంట సాగుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. వారు ఆయా మండలాల టీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ద్వంద్వ విధానాలను వీడాలని పేర్కొన్నారు.
కేంద్రానికి గుణపాఠం చెబుతాం : ఎమ్మెల్యే కాలె యాదయ్య
షాబాద్, నవంబర్ 18 : టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి వెళ్లి ధర్నాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు.