-ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ఆమనగల్లు, అక్టోబర్ 31 : కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు ఎన్ని కొర్రీలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరియాదవ్తో కలిసి ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. దీంతో గతేడాది రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగాయన్నారు. రైతులు ఎంతో సంబురంగా వ్యవసాయం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలతో రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారని తెలిపారు.
రోడ్డు వెడల్పుకు రూ.36 కోట్ల ప్రతిపాదనలు….
ఆమనగల్లు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. ఆమనగల్లు మండలం నుంచి తలకొండపల్లి ప్రధాన రహదారిని విస్తరించేందుకు సీఆర్‌ఎఫ్‌కు రూ.36 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రతిపాదనలు ఆమోదం కాగానే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌కు నూతన పాలకమండలికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈనెల 5 వతేదీన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ సముదాయాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవి, లాలయ్యగౌడ్, సర్పంచ్ భూపతిరెడ్డి, డైరెక్టర్ సుభాశ్, ఖలీల్, యాదయ్య, శంకర్, బాలస్వామి, జయరాం, సత్యం, నరేందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
పేదలకు సీఎంఆర్ఎఫ్ అండ
తలకొండపలి, అక్టోబర్ 31 : బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వాసవికి రూ.36 వేలు, చంద్రధన గ్రామానికి చెందిన రవీందర్‌కు రూ.16వేల చెక్కులు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కులను ఆదివారం లబ్ధిదారు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీకోఆప్షన్ సభ్యుడు రెహ్మాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, శ్రీశైలం, హరిమోహన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.