యాలాల, అక్టోబర్ 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో మండలంలోని పగిడ్యాల్ గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామ రోడ్డుకు ఇరువైపులా పచ్చని తోరణాల్లా హరితహారం మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలను నిర్మించడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. నిత్యం పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిని శుభ్రం చేస్తున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ వేసి సరిపడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. చివరి మజిలి కోసం నిర్మించిన వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. నిత్యం సేకరించిన చెత్తతో డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మించుకోవడంతో స్వచ్ఛ పల్లెగా మారింది. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు కళకళలాడుతున్నాయి.
మారిన గ్రామం..
‘పల్లె ప్రగతి’తో పగిడ్యాల్ గ్రామ రూపురేఖలు మారాయి. పడావుపడ్డ ఇండ్లను తొలగించడం, రోడ్లపై చెత్త లేకుండా చూడడం, తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, దోమల నివారణ వంటి పనులను నిత్యం చేస్తున్నారు.
పూర్తయిన ప్రగతి పనులు..
గ్రామంలో 2193 మంది జనాభా ఉన్నారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.3 లక్షలతో కంపోస్టుయార్డు, రూ.2 లక్షలతో పల్లెప్రకృతివనం పనులు పూర్తై అందుబాటులోకి వచ్చాయి. గ్రామ నర్సరీలో వివిధ రకాల 11 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. 30 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో 12 రకాలకు చెందిన 1800 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా 800 మొక్కలు నాటారు.
రూ.45 లక్షలతో అభివృద్ధి….
రెండేండ్ల కాలంలో రూ.45 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.5 లక్షలు జడ్పీ, రూ.40 లక్షల జీపీ నిధులతో గ్రామంలోని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు పలు అభివృద్ధి పనులను పూర్తి చేశారు.
గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం..
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఆధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పల్లెప్రగతి పనులను పూర్తి చేశాం. సీసీ రోడ్ల ఏర్పాటుతో గ్రామం పరిశుభ్రంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది.
పల్లెప్రగతి పనులు పూర్తి చేశాం..
వైకుంఠధామం, కంపోస్టుయార్డు తదితర పనులు పూర్తి చేశాం. ప్రతి రోజు తడి, పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్‌తో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. నర్సరీలో 11 వేల మొక్కలు పెంచుతున్నాం. దోమల నివారణకు మందులు పిచికారీ చేయిస్తున్నాం. నిత్యం ప్రతివీధిని శుభ్రం చేయిస్తున్నాం. సంపూర్ణ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.