ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 31 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆరబోసుకునేందుకు గతంలో నానా తంటాలు పడేవారు. కల్లాలు లేక ఆరుబయట, రహదారులు, వంతెనల మీద ఆరబోసుకునేటోళ్లు. రైతన్నల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కల్లాల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, బీసీలు, ఇతర రైతులకు పది శాతం భాగస్వామ్యంతో కల్లాలు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయించింది. ముందుకొచ్చిన రైతులు తమ వ్యవసాయ పొలాల్లోనే నూర్పిడి కల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విస్తీర్ణం బట్టి కల్లాలు..
రైతులకు ఉన్న స్థలం పరిధిలోనే 50, 60, 70 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టారు. 50 అడుగులకు రూ.56వేలు, 60 అడుగులకు రూ.68వేలు, 75 అడుగులకు రూ. 85వేలను మంజూరు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రైతులు పూర్తి చేసుకున్న కల్లాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో నిర్మాణం చేసుకున్న నూర్పుడు కల్లాలకు సంబంధించిన నిధులు ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కల్లాలకు నిధులు..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 4859 కల్లాల ఏర్పాటుకు రూ.32.74కోట్ల నిధులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. పొలాల్లోనే కల్లాలు ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ప్రమాదాల నివారణ..
రోడ్లపైనే ధాన్యం కుప్పలను ఉంచడంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదాల బారినపడేవారు. పొలాల్లోనే కల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు తప్పాయి. ఏర్పాటు చేసుకున్న కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకుని, పట్టాలు కప్పి భద్రంగా ఉంచుకుంటున్నారు.
కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి..
ఇంకా ఎవరైనా కల్లాలు నిర్మించుకోవాలని అనుకునే రైతులు ముందుకు రావాలి. ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిధులు అందజేస్తున్నది. రైతులు తమ పొలాల్లో పండించిన ధాన్యాన్ని అక్కడే అరబెట్టుకునేందుకు వీలు ఉంటుంది
ఇబ్రహీంపట్నం రైతులకు ఎంతో మేలు..
కల్లాల ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు చేకూరుతున్నది. పండించిన ధాన్యాన్ని వేరేచోటుకు తీసుకెళ్లి ఆరబెట్టే కష్టం తప్పడంతో పాటు సమయం ఆదా అవుతున్నది. సొంత పొలంలోనే ఆరబెట్టుకుని పట్టాలు కప్పి భద్రంగా చూసుకునే అవకాశం ఉన్నది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.