బడంగ్‌పేట, అక్టోబర్ 31 : రాష్ట్రంలో ఉన్న 30 వేల చెరువుల్లో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువులో ఆదివారం 32,400 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.89 కోట్ల ఖర్చుతో చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమం తీసుకున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 836 చెరువులు, కుంటల్లో రూ.1.23 కోట్లతో 1.72 కోట్ల చేప పిల్లలను వేశామన్నారు. కుల వృత్తులను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. చేపలు, ఆయా కులవృత్తులకు ప్రభుత్వం అండగా ఉన్నదన్నారు. రజకులకు ఉచిత దోబీఘాట్లు, లాండ్రీలకు ఇచ్చే విద్యుత్‌తో లబ్ధి చేకూరుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేయడంతో భారీ వర్షాల కారణంగా చెరువులకు జలకళ సంతరించుకున్నదన్నారు. దీంతో చేప పిల్లలను పెంచడానికి మంచి అవకాశం దొరికిందన్నారు. 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె గుర్తు చేశారు. బెస్త, ముదిరాజ్, మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఐదేండ్ల కాలంలో ప్రభుత్వం రూ.208 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల చేప పిల్లల ఉత్పత్తి జరిగిందన్నారు. వంద శాతం రాయితీతో రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువుల్లో చేప పిల్లలను పెంచుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు ఎర్ర మహేశ్వరి జైహింద్, వంగేటి ప్రభాకర్‌రెడ్డి, బండారు మనోహర్, సూర్ణగంటి అర్జున్, పెద్ద బావి సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ బడంగ్‌పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, రాళ్ల గూడెం శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.