షాద్నగర్, అక్టోబర్ 31: తెలంగాణలోని 30 వేల చెరువుల్లో సుమారు 93 కోట్ల ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదిలిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. ఆదివారం ఆమె తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువులో 5.13 లక్షల ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుని మత్స్య సంపద పెరిగిందని, ఇప్పటికే ఐదు విడతల్లో చేప పిల్లలను చెరువుల్లో వదిలినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉన్నదని, ప్రతియేటా రూ.89 కోట్లతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నదన్నారు. అదేవిధంగా రూ.25 కోట్లతో సుమారు 10కోట్ల రొయ్య పిల్లలను సుమారు 200 చెరువుల్లో పెంచుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 836 చెరువుల్లో రూ.1.25 కోట్లతో 1.72 కోట్ల చేప పిల్లలను ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పెంచు తున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఉచిత గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. రజకుల దోభీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పా రు. 100 శాతం రాయితీతో రిజర్వాయర్లు, చెరువులు, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదిలి పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మధు, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, మత్స్య కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.