విద్యార్థుల చదువును మెరుగుపర్చేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. త్రీఆర్స్(రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్)పై పట్టు సాధించేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్‌లను నిర్వహించి చదువులో వెనుకబడిన విద్యార్థులనూ గుర్తించింది. వీరికి నేటి నుంచి జిల్లా విద్యాశాఖ-భారత్ డెకో డాట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. ముఖ్యంగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని సారించారు. జిల్లావ్యాప్తంగా 97 స్కూళ్లలో మెజార్టీ విద్యార్థులు త్రీఆర్స్లో వెనుకబడినట్లు గుర్తించగా, వీరికి అధికారులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు టెస్ట్‌లు నిర్వహించి విద్యార్థుల్లోని పురోగతిని పరిశీలించనున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 31, (నమస్తే తెలంగాణ): చదువులో వెనుకబడిన విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా త్రీఆర్స్ ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్‌లను నిర్వహించిన విద్యాశాఖ అధికారులు చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించారు. సంబంధిత విద్యార్థులు మెరుగుపడేలా జిల్లా విద్యాశాఖ భారత్ డెకో డాట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ముఖ్యంగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులపై దృష్టి పెట్టారు. సంబంధిత తరగతులకు సంబంధించిన ప్రతీ విద్యార్థికి తెలుగు, ఇంగ్లిష్ చదువడం, రాయడంతోపాటు గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వచ్చేలా ప్రణాళికను రూపొందించారు. త్రీఆర్స్ రావడమే కాకుండా ప్రతీ విద్యార్థికి అన్ని సబ్జెక్టులపై పట్టు వచ్చేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా భారత్ డెకో డాట్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 250 ఉండగా, గత రెండు నెలల్లో ఇచ్చిన త్రీఆర్స్పై ప్రత్యేక తరగతులతో పలు స్కూళ్లలో విద్యార్థుల ప్రావీణ్యం మెరుగుపడగా, మరో 97 స్కూళ్లలోని 9, 10 తరగతుల మెజార్టీ విద్యార్థులు మెరుగుపడకపోవడంతో సంబంధిత స్కూళ్ల విద్యార్థులపై దృష్టి సారించారు. నవంబర్ మొదటి వారం నుంచి త్రీఆర్స్పై ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు అన్ని సబ్జెక్టుల్లో సంబంధిత స్కూళ్ల విద్యార్థులు పట్టు సాధించేలా తీర్చిదిద్దనున్నారు.
త్రీఆర్స్పై పూర్తైన ప్రీ, పోస్ట్ టెస్టులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి త్రీఆర్స్(తెలుగు, ఇంగ్లిష్ చదువడం, రాయడంతోపాటు గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం) వచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొదట తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ప్రీ టెస్ట్‌లు నిర్వహించి త్రీఆర్స్ ఎంతమంది విద్యార్థులకు వచ్చనే దానిపై సర్వే నిర్వహించారు. త్రీఆర్స్ రాని విద్యార్థులను గుర్తించి నెలరోజులపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి మరోసారి పోస్ట్ టెస్ట్‌లను నిర్వహించారు. పోస్టు టెస్ట్ అనంతరం కూడా మెరుగుపడని విద్యార్థులను గుర్తించిన అధికారులు అందరికీ త్రీఆర్స్ వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. 9, 10 తరగతుల విద్యార్థులకు తెలుగు చదువడం, రాయడంపై జిల్లావ్యాప్తంగా 20,426 మంది విద్యార్థులకు పోస్ట్ టెస్టు నిర్వహించగా, వీరిలో తెలుగు చదువడానికి వచ్చిన విద్యార్థులు 16213, చదువురానివారు 4398 మంది విద్యార్థులున్నారు. తెలుగు రాయడానికి వచ్చినవారు 13769, మరో 6637 మంది విద్యార్థులను తెలుగు రాసేందుకు రానివారిగా గుర్తించారు. ఇంగ్లిష్‌కు సంబంధించి చదువడం, రాయడం వచ్చిన విద్యార్థులు 7570, మరో 7506 మంది విద్యార్థులు పర్వాలేదనిపించగా, మరో 5687 మంది విద్యార్థులు ఇంగ్లిష్ చదువడం, రాయడం రానివారిగా గుర్తించారు. గణితానికి సంబంధించి కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వచ్చిన విద్యార్థులు 4337, యావరేజ్‌గా వచ్చే విద్యార్థులు 7954, అస్సలు రాని విద్యార్థులు 8012 మంది ఉన్నట్లు గుర్తించారు. గణితంలో బేసిక్స్, ఇంగ్లిష్ చదువడం, రాయడం రాని విద్యార్థులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా సంబంధిత సబ్జెక్టుల బేసిక్ నేర్పించడంతోపాటు సబ్జెక్టులపై కూడా పట్టు వచ్చేలా విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు.
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి : డీఈవో సుశీంద్రరావు
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ పెట్టి ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించాం. నవంబర్ మొదటి వారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతాయి. త్రీఆర్స్ సర్వే ప్రకారం 97 స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతీ విద్యార్థి మెరుగుపడేలా కృషి చేస్తాం.