పత్యామ్నాయ పంటల సాగు పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు భారీ సబ్సిడీ అందిస్తున్నది. నూనె, పప్పు దినుసుల పంటలు, కూరగాయల సాగు చేపట్టే రైతులకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సబ్సిడీ విత్తనాలను అందిస్తున్నది. కాగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో పెసర విత్తనాలు 124 క్వింటాళ్లు, శనగ 150, వేరుశనగ 63 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో వేరుశనగ 1600 క్వింటాళ్లు, శనగ 900, మినుములు 15, పెసర 5 క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయి. మరోవైపు అధికారులు వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుందని.. మంచి లాభాలు కూడా పొందవచ్చునని వివరిస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 10, (నమస్తే తెలంగాణ)/పరిగి : వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులకు అండగా నిలుస్తున్నది. అధిక మొత్తంలో సబ్సిడీని అందిస్తున్నది. విత్తనాల కొనుగోలు తదితరాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగానే ప్రత్యామ్నాయ పంటల సాగుకు సరిపోను విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. మరోవైపు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అర్జించే అవకాశాలున్న నేపథ్యంలో వరి పంటను సాగు చేసే ప్రతీ రైతు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పప్పుదినుసులు, చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే రైతులు అధిక లాభాలు ఆర్జించడంతోపాటు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు
ప్రత్యామ్నాయ పంటల సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే ప్రతీ రైతు లాభాలను పొందే అవకాశాలున్నాయి. జిల్లాలో ఎక్కువగా ఎర్ర నేలలే ఉన్న దృష్ట్యా వేరుశనగ, పెసర, జొన్న, మినుములు, పెసర, రాగులు, సజ్జలు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలం. యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, ఆముదం, కుసుమ, పొద్దుతిరుగుడు, మినుము, పెసర పంట సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. పెసర పంటకాలం 65-70 రోజులు. ఎకరానికి 4 క్వింటాళ్ల మేర దిగుబడి పొందవచ్చు. మినుము ఎర్ర నేలలతోపాటు నల్లరేగడి, చౌడు నేలల్లో కూడా సాగు చేయొచ్చు. మినుములు, పెసర పంటలు ఈ నెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. మినుము పంట కాలం 80 రోజులు. ప్రొద్దుతిరుగుడు పంటను వానాకాలం, యాసంగిలోనూ సాగు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ పంట కాలం 100 రోజులు. వేరుశనగ సాగు జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. కేవలం 110 రోజుల్లో పంట చేతికొస్తుంది.
అధిక సబ్సిడీ
ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి విత్తనాల కొనుగోలులో భాగంగా ప్రభుత్వం 70 శాతం మేర సబ్సిడీని అందిస్తున్నది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో శనగ, వేరుశనగ, పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పెసర సబ్సిడీపోను క్వింటాలుకు రూ.5వేలు, శనగ క్వింటాలుకు రూ.2500, వేరుశనగ క్వింటాలుకు రూ.3375లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి జిల్లాలో పెసర విత్తనాలు 124 క్వింటాళ్లు, శనగ విత్తనాలు 150 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 63 క్వింటాళ్ల మేర అందుబాటులో ఉన్నాయి.
595 క్వింటాళ్ల విత్తనాలు అందజేత
యాసంగిలో వికారాబాద్ జిల్లా పరిధిలో 55వేల బోర్లు ఉండగా, 1179 చెరువులు, ఒక మధ్య తరహా ప్రాజెక్టు ఉన్నది. వీటి కింద సుమారు 88497 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురువడంతో భూగర్భ జలాలు పెరుగడంతోపాటు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. తద్వారా యాసంగి సీజన్లో లక్ష ఎకరాల వరకు పంటలు సాగు చేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. యాసంగిలో 28293 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో యూరియా 11387 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6100 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 1696, కాంప్లెక్స్ 6787, ఎస్ఎస్పీ 2321 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎక్కడికక్కడ బఫర్ స్టాకులు ఏర్పాటు చేస్తారు.
అందుబాటులో 2520 క్వింటాళ్ల విత్తనాలు
వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం వ్యవసాయ శాఖ వద్ద వేరుశనగ 1600 క్వింటాళ్లు, శనగ 900, మినుములు 15, పెసర 5 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్తనాల ప్రకారం వేరుశనగ 1600 ఎకరాలు, శనగ 3600 ఎకరాలు, మినుములు 375 ఎకరాలు, పొద్దు తిరుగుడు 125 ఎకరాలలో సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు ప్రస్తుతం సిద్దంగా ఉన్నాయి. మరోవైపు ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద సబ్సిడీపై వేరుశనగ, శనగ విత్తనాలు అందజేస్తున్నారు. వేరుశనగ విత్తనాలు 400 క్వింటాళ్లకుగాను క్వింటాలుకు రూ.8900, సబ్సిడీపోను రూ.4900కు అందజేస్తున్నారు. శనగ విత్తనాలు 195 క్వింటాళ్లలో ఎన్బీఈజీ-49 రకం 98 క్వింటాళ్లకుగాను క్వింటాలుకు రూ.6750, సబ్సిడీపోను రూ.3375 చెల్లించాల్సి ఉంటుంది. జేజీ-11 రకం 97 క్వింటాళ్లకుగాను క్వింటాలుకు రూ.6750, సబ్సిడీపోను రూ.4250 చెల్లించాలి. ఇదిలావుండగా గత వానకాలంలో రైతులు అంతరపంటగా సాగు చేసేందుకు కంది, పెసర విత్తనాల మినీ కిట్లు రైతులకు ఉచితంగా అందజేశారు. కంది విత్తనాలు 837.04 క్వింటాళ్లు, పెసర 518 క్వింటాళ్లు మొత్తం 1355.04 క్వింటాళ్ల విత్తనాలు మినీ కిట్స్గా జిల్లావ్యాప్తంగా 31,000 మంది రైతులకు ప్రభుత్వం అందజేసింది. అంతర పంటల సాగు పెంచడంతోపాటు ఒక పంట దెబ్బతిన్నా మరో పంట దిగుబడితో రైతుకు నష్టం రాకుండా ఉండాలన్నది మినీ కిట్స్ అందజేత ప్రధాన లక్ష్యం. ఇదిలావుండగా జిల్లా వ్యాప్తంగా యాసంగిలో జొన్న పంట సుమారు 2500 ఎకరాల వరకు సాగు చేయబడుతుంది. రైతులు స్థానిక రకం జొన్న సాగును చేపడేతారు. ఈ జొన్నలు తాము తినడానికిగాను స్థానిక రకం జొన్న విత్తనాలు ఉపయోగించి పంట సాగు చేస్తారు. ఈసారి జొన్న సాగు సైతం మరింత పెంచడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు
విత్తనాలు అందుబాటులో ఉన్నాయి