రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంతో పాటుగా ఆయా గ్రామాల్లో నివాసమున్న ఉత్తర భారతీయులు ఛఠ్ పూజను ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన పెహలాఆర్ఘా కార్యక్రమం ఆకట్టుకున్నది. భక్తులు పెద్ద ఎత్తున చెరువు గట్ల వద్దకు చేరుకుని సూర్యభగవానుడికి పండ్లు, కూరగాయలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కొత్తూరు రూరల్, నవంబర్ 10 : ఉత్తరాది భారతీయులు మూడు రోజులుగా ఎంతో నియమనిష్టలు, భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజను నిర్వహించుకున్నారు. బుధవారం మహిళలు, భక్తులు పెహలా ఆర్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛఠ్ పూజను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని కొత్తూరుతో పాటు ఆయా గ్రామాల్లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువత చెరువు గట్ల వద్దకు చేరుకుని సూర్యభగవానుడికి పండ్లు, కూరగాయలను నైవేద్యంగా సమర్పించి హారతిని ఇచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఉత్తరాది రాష్ర్టాల ప్రజలు నిర్వహించుకునే పండుగ వేడుకల్లో అతిపెద్ద పండుగ ఛఠ్పూజ. ఈ ఉత్సవాలను చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా కఠిన ఉపవాస దీక్షలతో ఎంతో భక్తిభావంతో నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది దీపావళి నుంచి ఆరో రోజున ఛఠ్ పూజను నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారు. మొదటి రోజును సహాయ్ఖాయ్, రెండో రోజును ఖర్నా, మూడో రోజును పెహలా ఆర్టా, నాలుగో రోజును పార్నాగా పేర్కొంటారు. చివరి రెండు రోజుల్లో చెరువులు, కుంటల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రసాదాలను చాటలో సమర్పిస్తారు. దీంతో ఉపవాస వ్రతం ముగుస్తుంది. పవిత్రంగా భావించే ఈ కార్తికమాసంలో వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరిన కోర్కెలు కచ్చితంగా తీరుతాయని వారి ప్రగాఢనమ్మకం.
బుధవారం సాయంత్రం మహిళలు, భక్తులు తమ తమ కుటుంబసభ్యులతో కలిసి గ్రామాల్లో గల చెరువులు, కుంటలు, కొలనుల వద్దకు చేరుకుని సూర్య భగవానుడికి దర్శనం చేసుకుని చెరుకుగడలు, కూరగాయలు, పండ్లు, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. కొత్తూరు మండలపరిధిలోని ఆయా చెరువులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరిగి గురువారం తెల్లవారుజామున నిర్వహించేటువంటి పార్నా ఉత్సవంతో ఛఠ్పూజ ముగుస్తుంది. పార్నాతో భక్తులు ఉపవాసదీక్షలను విరమించనున్నారు. ఈ సందర్భంగా ఆయా కుంటలు, కొలనుల వద్దకు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు చేరుకుని ప్రజలకు పండుగ శుభాకాంక్షలను తెలియచేశారు.
కొత్తూరు, నవంబర్ 10: ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో ఉత్తర భారతీయులు నిర్వహించే ఛఠ్ పూజను బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మందోని మైసమ్మ గుడి వద్ద చెరువులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య హాజరయ్యారు.