బంట్వారం, నవంబర్ 7 : మండల కేంద్రంలో నూతనంగా పల్లె ప్రకృతి వనం 1.5 ఎకరాల్లో సుమారు రూ 8 లక్షలతో ఏర్పాటు చేశారు. ఒక బోరు బావి తవ్వించి మొక్కలకు నీటి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా, పార్కు నిర్వహణకు కూలీలను నియమించి పనులు చేస్తున్నారు. ప్రతి రోజూ ఒకరిద్దరు కూలీలు పార్కులో ఉన్న చెత్తా చెదారాన్ని తీయడంతో పాటు, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పార్కు లో ఉన్న ప్రతి మొక్కనూ రక్షించాలనే సంకల్పంతో చుట్టూ ఫినిషింగ్ వేశారు. పార్కులో రెండు వేలకు పైగా వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మొక్కలను పార్కులో నాటారు. అందులో ప్రధానంగా మలబార్వేప, బాదాం, మారేడు, అల్ల నేరేడు, రావి, జామ, పారిజాతం, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, శ్రీగందం, ఇప్ప, రేగు, పనస, జంబి, కొబ్బర, పోక, పొగడ, మహాగని, మల్లే, తులసీ, గన్నేరు, కృష్ణతులసీ, అల్లనేరేడు, గులాబీ, గన్నేరు, వెదురు, కోనకర్పస్, నూరువరాలు, మందారం మునగ, ఉసిరి, చింత తదితర మొక్కలను నాటారు. ఈ మొక్కలన్నీ నాటిన ఎనిమిది నెలల్లోనే ఏపుగా పెరిగాయి. పార్కు స్థలం గులకరాళ్లతో, బీడు భూమిగా ఉండి ఎలాంటి ఉపయోగం లేకుండా, పశువుల మేతకు మాత్రమే పనికి వచ్చేది. అలాంటిది సర్పంచ్ లావణ్య ఆధ్వర్యంలో కూలీలతో రాళ్ళు తొలగించి, వివిధ ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చి పోశారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఎంతో అనుకూలంగా మారింది. దీంతో ప్రతీ మొక్క నేడు సాధారణ పెరుగుదలకన్నా, రెండు రేట్లు అధికంగా పెరిగింది.
గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం
ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పార్కులు, వైకుంఠధామం, రోడ్లు, వీధుల్లో పరిశుభ్రతకు ఇచ్చే నిధులతో అందంగా తీర్చి దిద్దుతున్నాం. పారుశుధ్య కార్మికులు గ్రామం లో చెత్తను నిల్వ ఉంచకుండా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ప్రజలు సహకరిస్తున్నారు..
ప్రభుత సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్నాం. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నాం. వారి సహకారాలను ఎప్పటికప్పుడు తీసుకుంటు న్నాము. పంచాయతీ కార్యకలాపాలలో ప్రజలు చురుగ్గా పాల్గొంటూ అభివృద్ధికి సహకరిస్తున్నారు.